- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIని చూసి ఎవరూ భయపడొద్దు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది న్యాయమూర్తులకు ఒక సహాయకారి మాత్రమేనని, అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Suryakant) కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత అనేది కేవలం పనిని సులభతరం చేసే సాధనం మాత్రమేనని, అది ఎప్పటికీ మానవ మేధస్సుకు, న్యాయమూర్తుల విచక్షణకు ప్రత్యామ్నాయం కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ కర్ణాటకలో జరిగిన ‘ఏఐ యుగంలో న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం’ అనే సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయాధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను చూసి న్యాయాధికారులు భయపడాల్సిన పనిలేదని, దాని పరిమితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సీజేఐ సూచించారు. ‘సంక్లిష్టమైన కేసులను పరిష్కరించేటప్పుడు మీలోని న్యాయమూర్తి స్వతంత్రంగా ఉండాలి, సాంకేతిక పరికరాలు మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.
AI భ్రమ పట్ల జాగ్రత్త..
న్యాయపరమైన పరిశోధనలు (Legal Research) చేయడానికి, కేసుల నిర్వహణను మెరుగుపరచడానికి, భారీ డేటాను క్రమబద్ధీకరించడానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీంతో న్యాయమూర్తుల సమయం ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఏఐ కొన్నిసార్లు తప్పుడు కోర్టు తీర్పులు, వాడకంలో లేని చట్టాలను సృష్టించే ప్రమాదం ఉందని జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. ఇలాంటి భ్రమలు న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టించే అవకాశం ఉన్నందున, ఏఐ ఇచ్చే సమాచారాన్ని తప్పనిసరిగా సరిచూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. న్యాయం అందించడం అనేది కేవలం గణాంకాలతో కూడిన ప్రక్రియ కాదని, అది నైతిక, సామాజిక రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఏ యంత్రం కూడా మానవ అనుభవాన్ని, నైతిక విచక్షణను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. సాంకేతికతను మన అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలి కానీ, దానికి బానిసలు కాకూడదని సీజేఐ హితవు పలికారు. న్యాయవ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతూనే ఆధునిక మార్పులను ఆహ్వానించాలని జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు.






