యుద్ధం ఎఫెక్ట్: ఖతార్ నుంచి ఐదేళ్ల పాటు నో ఎల్‍ఎన్‍జీ సరఫరా!.. ఈ దేశాలపై భారీగా ప్రభావం

by Prasad Jukanti |   (  Updated:2026-03-20 04:47:43  IST  )

ఇరాన్ దాడులతో ఖతార్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్లు ధ్వంసం కావడం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

యుద్ధం ఎఫెక్ట్:  ఖతార్ నుంచి ఐదేళ్ల పాటు నో ఎల్‍ఎన్‍జీ సరఫరా!.. ఈ దేశాలపై భారీగా ప్రభావం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు ప్రపంచ దేశాలకు సెగలు పుట్టిస్తున్నాయి. ఖతార్‍లోని కీలక రస్ లఫాన్ (Ras Laffan) గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు చేయడం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్‍ను భారీ సంక్షోభంలోకి నెట్టింది. యుద్ధం దెబ్బకు ఇప్పటికే ఇంధన రంగం (Energy Market) తీవ్ర ప్రభావానికి లోను కాగా తాజాగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల కారణంగా ఖతార్‌లోని (Qatar) ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ప్లాంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల ఖతార్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతి సామర్థ్యంలో 17 శాతం మేర కోత పడిందని, దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్-కాబీ వెల్లడించారు. అయితే ఈ ఫ్లాంట్లు దెబ్బతినడంతో మరో ఐదేళ్లపాటు ఎల్ఎన్‍జీ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడబోతోందని దాంతో ఖతార్‍పై ఆధారపడిన దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే టాక్ వినిపిస్తోంది.

మరమ్మతులకే ఏళ్ల సమయం:

ఇరాన్ జరిపిన దాడుల్లో ఖతార్‌కు చెందిన 14 ఎల్‌ఎన్‌జీ ట్రైన్‌లలో రెండు పూర్తిగా, మరో రెండు గ్యాస్-టు-లిక్విడ్స్ (GTL) ప్లాంట్లలో ఒకటి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే దెబ్బతిన్న ఈ యూనిట్లను పునరుద్ధరించడానికి కనీసం 3 నుండి 5 ఏళ్లు సమయం పడుతుందని ఇంధన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతులు నిలిచిపోనుండటంతో ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనాలపై భారీగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక భారత్ తన సహజ వాయువు అవసరాలలో సుమారు 20 శాతం ఖతార్ నుండే దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశంలోని పరిశ్రమలు, ముఖ్యంగా హోటళ్లు మరియు రెస్టారెంట్లలో వాడే ఎల్‌పీజీ (LPG) సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. హీలియంను సరఫరాపై కూడా ప్రభావం పడటంతో చిప్‌మేకర్లకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

యుద్దం ఆగినా తేరుకోవడం కష్టమే:

ఈ యుద్ధంలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇరు పక్షాలకు భారీగా సమయం బడుతుందని ఈ దెబ్బతో ప్రభావిత దేశాలు మరో దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్లినట్లయిందనేది అంతర్జాతీయ నిపుణుల అంచనా.
Next Story