Custodial Death Case: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ కు బెయిల్ నిరాకరణ

by Shamantha N |

మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాక‌రించింది. ఓ క‌స్ట‌డీ డెత్ కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న సంజీవ్ భట్.. బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Custodial Death Case: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ కు బెయిల్ నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాక‌రించింది. ఓ క‌స్ట‌డీ డెత్ కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న సంజీవ్ భట్.. బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, సందీప్ మెహ‌తాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో తీర్పును ఇచ్చింది. బెయిల్ ఇవ్వ‌కున్నా.. ప్రాధాన్య‌త ఆధారంగా ఈ కేసు విచార‌ణ వేగవంతం చేయాలని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది. సంజీవ్ భ‌ట్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఆస‌క్తిగా లేమ‌ని, బెయిల్ అప్పీల్‌ను తిర‌స్క‌రిస్తున్నామంది. అయితే ఈ కేసులో విచార‌ణ మాత్రం కొన‌సాగుతుంద‌ని బెంచ్ తెలిపింది.

అసలు కేసు ఏంటంటే?

1990లో గుజరాత్ లోని జామ్‌న‌గ‌ర్ లో అద్వానీ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు రథయాత్ర చేపట్టారు. ఆ సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. దీంతో, అక్టోబర్ 30న బీజేపీ, వీహెచ్ పీ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఆ సమయంలో జామ్ నగర్ కు అద‌న‌పు ఎస్పీగా సంజీవ్ భట్ ఉన్నారు. టాడా చ‌ట్టం కింద 130 మందిని అప్ప‌ట్లో అరెస్టు చేశారు. అయితే అరెస్టు అయిన వ్య‌క్తుల్లో ప్ర‌భుదాస్ వైష్ణాని క‌స్ట‌డీ నుంచి రిలీజైన త‌ర్వాత ప్రాణాలు కోల్పోయాడు. క‌స్ట‌డీలో ఉన్న స‌మ‌యంలో భ‌ట్ పెట్టిన టార్చ‌ర్ వ‌ల్లే ప్ర‌భుదాస్ చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌లో భ‌ట్‌పై కేసు న‌మోదు చేశారు. ఇద్ద‌రు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్ల‌పై ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. జామ్‌న‌గర్‌లోని సెష‌న్స్ కోర్టు భ‌ట్‌తో పాటు ఇత‌ర పోలీసుల‌కు జీవిత ఖైదు శిక్ష వేసింది. జ‌న‌వ‌రి 2024లో భ‌ట్ అప్పీల్‌ను గుజ‌రాత్ హైకోర్టు తిరస్క‌రించింది. దీంతో అత‌ను సుప్రీంను ఆశ్రయించాడు. ఇకపోతే, భ‌ట్‌పై మ‌రో రెండు కేసులు కూడా ఉన్నాయి. 1996 డ్ర‌గ్స్ కేసుతో పాటు 1997 క‌స్ట‌డీ డెత్ కేసులున్నాయి. 1996లోని డ్రగ్స్ కేసులో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనిపై ఆయన చేసిన అప్పీల్ గుజరాత్ హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. 1997 కస్టడీ డెత్ కేసులో ఆయనను డిసెంబర్ 2024లో మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

Next Story