ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించిన జేడీయూ

by Ajay Maddhiboyina |

జేడీయూ ఎమ్మెల్యే మద్దతు లేకపోయినా బీరేన్ సింగ్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడదు.

ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించిన జేడీయూ
X

- బీరేన్ సింగ్ ప్రభుత్వానికి నితీశ్ పార్టీ ఝలక్

- ప్రతిపక్షంలో కూర్చుంటామంటూ గవర్నర్‌కు లేఖ

- ఖండించిన జాతీయ నాయకత్వం

దిశ, నేషనల్ బ్యూరో:

మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వలోని ఎన్డీయే ప్రభుత్వానికి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ మద్దతు ఉపసంహరించింది. మణిపూర్ రాష్ట్ర జేడీయూ పార్టీ ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. బీరేన్ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ఇకపై ప్రతిపక్ష పార్టీలకు కేటాయించిన బెంచిలలో కూర్చుంటారని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు క్షత్రిమాయుమ్ బీరెన్ సింగ్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు. జేడీయూ ఎమ్మెల్యే మద్దతు లేకపోయినా బీరేన్ సింగ్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడదు. 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 37 మంది సభ్యులు ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు స్వతంత్రులు ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు. 2022లో జరిగిన మణిపూర్ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలిచింది. అయితే అప్పట్లో జేడీయూ ఇండియా కూటమిలో చేరిన తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు. మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్‌కు ప్రతిపక్ష బెంచ్‌లో సీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే నిరుడు జనవరిలో ఎన్డీయేకు మద్దతుతో నితీశ్ కుమార్ మరోసారి బీహార్‌కు సీఎం అయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోని ఎన్డీయేకు తన మద్దతు ప్రకటించారు. కానీ మణిపూర్‌లో మాత్రం జేడీయూ మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ఆ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాయడం సంచలనంగా మారింది.

ఎన్డీయేకు మణిపూర్‌లో మద్దతు ఉపసంహరిస్తున్నట్లు క్షత్రిమాయుమ్ బీరేన్ సింగ్ లేఖ రాసిన విషయం బయటకు రాగానే జేడీయూ ఆ చర్యను తీవ్రంగా ఖండించింది. బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని.. అవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయిన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ అన్నారు. క్షత్రిమాయుమ్ బీరేన్ సింగ్ తన వ్యక్తిగతంగా ఈ లేఖ రాశాడని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాదని రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. మణిపూర్ రాష్ట్ర కమిటీ ఈ లేఖ రాయడానికి ముందు జాతీయ నాయకత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.

Next Story