Nitin Gadkari: కొడుకుల వ్యాపారాల కోసమే ఇథనాల్ ప్రమోషన్!.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై విమర్శల వెనుక అసలు రీజన్ ఇదేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-09-11 11:55:06  IST  )

ఇథనాల్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రమోషన్ వెనుక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Nitin Gadkari: కొడుకుల వ్యాపారాల కోసమే ఇథనాల్ ప్రమోషన్!.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై విమర్శల వెనుక అసలు రీజన్ ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అంటే తెలియని వారు ఉండరు. తన మనసులో ఉన్న విషాయాలను కుండబద్దలు కొట్టినట్లు బహిరంగంగా చెప్పే ఆయన మాటలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి నితిన్ గడ్కరీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా లక్ష్యం చేసుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ వార్షిక సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol Petrol) విషయంలో వ్యక్తం అవుతున్న ఆందోళనలను నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఎలా పనిచేస్తుందో రాజకీయాలు కూడా అలాగే పని చేస్తాయని, కొందరు డబ్బులు చెల్లించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఇందులో నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే నితిన్ గడ్కరీ విషయంలో సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతోంది? కేంద్ర మంత్రి ఎందుకంతలా రియాక్ట్ కావాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

సోషల్ మీడియాలో విమర్శలు:

ఏ మాత్రం అవకాశం దొరికినా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ పెట్రోల్ అంశాన్ని పబ్లిసిటీ చేస్తూ వస్తున్నారు. శిలాజ ఇంధనాలు దిగుమతి చేసుకోవడానికి మన దేశం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు ఇథనాల్ ఒక ప్రత్యామ్నాయం అని, అందుబాటు ధరలో స్వదేశంలో ఉత్పత్తి అవుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇంత మంచి విషయాలు చెబుతున్న నితిన్ గడ్కరీపై మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోతున్నాయని నెటిజన్లు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. గతంలో మెరుగైన మైలేజ్ ఇచ్చే వాహనాలు ఈ ఇంధనం వాడకంతో మైలేజ్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. వాహనాలు చెడిపోతున్నాయని వాహనరంగ నిపుణులు చెబుతున్నా ఇథనాల్ ఇంధనాన్ని ప్రమోట్ చేస్తున్న నితిన్ గడ్కరీకి మధ్యతరగతి ప్రజలంటే ఎందుకింత కోపం అని పలువురు ప్రశ్నిస్తూ పోస్టులు చేస్తున్నారు. అయితే నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యల వెనుక ఈ విమర్శలే కారణమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా?

ప్రచారం వెనుక బిజినెస్?:

తనను రాజకీయంగా టార్గెట్ చేసేందుకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్కరీ చేసిన వ్యాఖ్యల వెనుక మరో కారణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ఇ-20 పెట్రోల్ విషయంలో రెండు రోజుల క్రితం ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathi) ఓ వీడియో చేశారు. ఇందులో నితిన్ గడ్కరీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పెట్రోల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఇథనాల్ పెట్రోల్ ను ఇంతలా ప్రమోట్ చేయడం వెనుక షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ బై ప్రొడక్ట్ నుంచి ఇథనాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి ఉండటం కూడా ఓ కారణం అని ఆరోపించారు. ముంబయిలో 'పూర్తి పవర్ అండ్ షుగర్ లిమిటెడ్ గ్రూప్' అనే షుగర్ ఫ్యాక్టరీ ఉందని దీనికి యజమాని నితిన్ గడ్కరీ అని ధ్రువ్ ఆరోపించారు. నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి అయిన నాటి నుంచి ఇథనాల్ కోసం లాబీయింగ్ చేస్తున్నారని, 2014 జూన్ లో ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ లో ఇథనాల్ ను కలపడాన్ని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పూర్తి గ్రూప్ నుంచి మానస్ అగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్, సీఐఏఎన్ (అగ్రో ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిట్) అనే మరో రెండు సంస్థలు ఏర్పాటు అయ్యాయని ఆరోపించారు. ఈ రెండు గ్రూప్ లను నితిన్ గడ్కరీ ఇద్దరు కుమారులు సారంగ్ గడ్కరీ, నిఖిల్ గడ్కరీ నడిపిస్తున్నారని ఈ రెండు సంస్థలు కూడా ఇథనాల్ బిజినెస్ లోనే ఉన్నాయని చెప్పారు. ఈ రెండు సంస్థల రెవెన్యూ గడిచిన ఐదేళ్లలో 37.55 శాతం గ్రోత్ సాధించాయని, ఇదే రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే గడ్కరీ కుమారుల సంస్థలు ఐదు రేట్లు ఎక్కు లాభాల్లో నడుస్తున్నాయని ఆరోపించారు.

ఇంధన శాఖ కాకపోయినా నితిన్ గడ్కరీ మాత్రం తన పూర్తి సమయాన్ని ఇథనాల్ ప్రమోట్ చేయడంపైనే వెచ్చిస్తున్నారని, ఇథనాల్ వాడాలని ప్రభుత్వానికి పదే పదే చెబుతున్నారని ఆరోపించారు. నిజానికి నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖకు మంత్రిగా ఉన్నారు. 2024 చివరి నాటికి భారత దేశంలోని రోడ్లన్ని అమెరికా తరహా అవుతాయని పార్లమెంట్ లో చెప్పారు. కానీ దేశంలోని జాతీయ రహదారులు ఒక్క వర్షానికే కుప్పుకూలుతున్నాయి.తెలంగాణలోని నేషనల్ హైవే 44 ఒక్క వర్షానికే భూమిలోకి కుంగిపోయింది. మిగతా రాష్ట్రాల్లోని జాతీయ రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. కానీ వాటిని చూసేవారు ఎవరు లేరని ఆరోపించారు. ధ్రువ్ రాఠీ చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ గడ్కరీ తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది.

Next Story