Nimisha Priya: నిమిష ప్రియపై కేసును కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగానే చూస్తోంది: సుప్రీంకోర్టు

by S Gopi |

నిమిషా ప్రియ కుటుంబం తరపున హాజరైన న్యాయవాది ఈ మేరకు అనుమతి కోరారు.

Nimisha Priya: నిమిష ప్రియపై కేసును కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగానే చూస్తోంది: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియపై యెమెన్‌లో పడిన ఉరిశిక్ష కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం 'జాగ్రత్తగానే చూస్తోందని ' సుప్రీంకోర్టు పేర్కొంది. ఉరిశిక్షను ఈ వారం ప్రారంభంలో యెమెన్ అధికారులు వాయిదా వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యెమెన్‌కు వెళ్లడానికి అనుమతివ్వాలని నిమిష ప్రియకు చెందిన ఓ టీమ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా, నిమిషా ప్రియ కుటుంబం తరపున హాజరైన న్యాయవాది ఈ మేరకు అనుమతి కోరారు. తమ సభ్యులతో పాటు కేరళ సున్నీ ఇస్లామిక్ నాయకుడు, ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముసలియార్ కూడా యెమెన్‌కు వెళ్లడానికి వారు అనుమతివ్వాలన్నారు. అయితే, ప్రయాణ నిషేధం అమలులో ఉన్నందున ఈ విషయానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్రం వద్దకే వెళ్లాలని తెలిపింది. దీనిపై కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు వివరాలు తెలియజేసింది. యెమెన్ ఆమె మరణశిక్షను తాత్కాలికంగా నిలిపేసిందని, ఈ కేసులో ప్రభుత్వం నుంచి చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వివరించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, నిమిష ప్రియ కేసులో కేంద్రం వీలైనన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోందని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే నిర్ణయం కాబట్టి, అక్కడ అభ్యర్థన చేసుకునేందుకు పిటిషనర్లకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను ఆగష్టు 14కి వాయిదా వేసింది.

Next Story