- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగాలు చేస్తున్నా.. మహిళలపై ఆగని అత్తింటి హింస : NFHSలో షాకింగ్ విషయాలు
దేశంలో పెళ్లైన మహిళలపై ప్రతి నిత్యం భర్త, అత్తింటి వారు హింసకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీనిపై NFHS షాకింగ్ విషయాలు వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పెళ్లైన మహిళలపై ప్రతి నిత్యం భర్త, అత్తింటి వారు హింసకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మహిళా సాధికారత పెరిగినా, మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ తమ కాళ్లపై నిలబడినా.. వారికి భర్త, అతని తరపు బంధువులు గౌరవం ఇవ్వడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఎంత చేసినా.. హా చేశావులే.. నువ్వొక్కదానివే చేస్తున్నావా అంటూ కించపరిచే మనుషుల మధ్యే మహిళలు బ్రతుకుతున్నారు. ఈ విషయాలను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (IIPS) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ.. 2023-24 కాలంలో ఈ సర్వేను నిర్వహించింది. సుమారు 715 జిల్లాల్లోని 6.79 లక్షల ఇళ్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా.. మహిళలపై జరుగుతున్న హింస గురించి ఈ నివేదికలో తెలిపింది.
డిజిటల్ పరిజ్ఞానం పెరిగినా..
గత సర్వేలతో పోలిస్తే ఈసారి మహిళలు డిజిటల్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ వాడకం, ఆర్థిక సాధికారతలో గణనీయమైన ప్రగతిని సాధించారని పేర్కొంది. గతంలో ఇంటర్నెట్ ఉపయోగించిన మహిళల శాతం 33.3 శాతం ఉండగా.. అది రెట్టింపై 64.3 శాతానికి చేరుకుంది. అలాగే సొంత బ్యాంక్ అకౌంట్లు లేదా పొదుపు ఖాతాలు ఉన్న మహిళల సంఖ్య కూడా 78.6 శాతం నుంచి 89.0 శాతానికి పెరిగింది. సొంతంగా మొబైల్ వాడుతున్న మహిళల సంఖ్య 53.9 శాతం నుంచి 63.6 శాతానికి పెరిగింది. అన్నిరంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నప్పటికీ.. 20 శాతం మంది భారత మహిళలు తమ భర్తలు, అత్తింటి వేధింపులకు గురవుతున్నారని NFHS ఆవేదన వ్యక్తం చేసింది.
ఏ రంగంలో ఉన్న మహిళలైనా ఈ వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొంది. ఐటీ, నాన్ ఐటీ, ప్రభుత్వ, బ్యాంకింగ్, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైతం హింసకు గురవుతున్నారని, వరకట్న వేధింపులు, అనుమానం, పిల్లలు లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొంది. కొందరు వీటిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. వారిలో యుక్తవయసు మహిళలే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా వేధింపులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మెన్‌స్ట్రువల్ హైజీన్ లో పురోగతి
15-24 సంవత్సరాల వయస్సు గల యువతులలో సురక్షితమైన, పరిశుభ్రమైన బహిష్టు రక్షణ పద్ధతులను పాటించే వారి సంఖ్య 77.6% నుండి 79.2% కి పెరిగింది. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం (RKSK)లోని మెన్‌స్ట్రువల్ హైజీన్ స్కీమ్ (MHS), ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద అందుబాటు ధరల్లో లభిస్తున్న శానిటరీ ఉత్పత్తుల వల్లే ఈ అవగాహన, మార్పు సాధ్యమైందని నివేదిక పేర్కొంది.






