కుష్నర్ సీక్రెట్ మిషన్: ఇస్లామాబాద్ చర్చల వెనుక హిడెన్ ఎజెండా

by Harish SP |

ముఖాముఖి చర్చలు లేవన్నప్పటికీ.. ఇరాన్, అమెరికా ప్రతినిధులు అరాగ్చీ, కుష్నర్ విడిగా అరగంటపాటు సమావేశం కావడంలో అర్థమేంటి?

కుష్నర్ సీక్రెట్ మిషన్: ఇస్లామాబాద్ చర్చల వెనుక హిడెన్ ఎజెండా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇస్లామాబాద్‌ వేదికగా జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలు కేవలం మిడిల్ ఈస్ట్‌లో ‘శాంతి’ కోసం జరుగుతున్నవి అనుకుంటే పొరపాటు పడినట్టే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఆయన సలహాదారు జారెడ్ కుష్నర్ రంగంలోకి దిగారంటేనే అక్కడ ఒక ‘మాస్టర్ మైండ్ గేమ్’ మొదలైందని అర్థం. నిజానికి మొదటి విడత చర్చలకు ముందే అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఇరాన్ స్పీకర్ బాలిఘాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీకి తాత్కాలిక రక్షణ ఇస్తున్నట్లు ప్రకటించాయి. అంటే వారిద్దరినీ తమ దళాలు టార్గెట్ చేసుకోవని స్పష్టం చేశాయి. వీరి ద్వారానే తాము చర్చలు జరుపాలని ఈ రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని పరోక్ష సంకేతాలు పంపాయి. దీంతో ఐఆర్జీసీ నేతృత్వంలోని ఇరాన్‌లోని అతివాద నేతలు, బాలిఘాఫ్, అరాగ్చీ నేతృత్వంలోని మితవాద రాజకీయ నేతలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. మొదట ఇరాన్ లో ప్రజలనుంచి తిరుగుబాటు వస్తుందని ఊహించి భంగపడిన అమెరికా, ఇజ్రాయెల్ కు ఇప్పుడు ఇరాన్ లోని నేతల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ కు మధ్య గతంలో చరిత్రాత్మక ‘అబ్రహం ఒప్పందం’ కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన కుష్నర్ ఇప్పుడు ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా ఈ చర్చల్లో అంతిమంగా రెండు ప్రధాన రహస్య ఒప్పందాలు కుదరనున్నాయి.. అందులో ఒకటి ఇరాన్ ఇకపై యువాన్ కరెన్సీకి డాలర్ తో చమురు విక్రయాలు జరపాలి. రెండోది ఇజ్రాయెల్ ను ఇబ్బందిపెడుతున్న హమాస్, హౌతీ, హిజ్బుల్లాలకు మద్దతు తగ్గించుకోవడం. ఇందుకు ఐఆర్జీసీని బలహీనపరిచి.. ఇరాన్‌లో మితవాద రాజకీయనేతలకు పట్టం కట్టడంపైనే కుష్నర్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఇరాన్‌లోని మితవాద రాజకీయ నేతలకు సైనిక మద్దతు లభిస్తే ఇరాన్ లో ఐఆర్జీసీని అణిచివేయడం పెద్ద కష్టమేమీ కాదన్న ధోరణిలో కుష్నర్ వర్గం భావిస్తున్నది. అందుకే ఇరాన్ విషయంలో చర్చలకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కంటే కుష్నర్, విట్కాఫ్ లకే ట్రంప్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తంగా ట్రంప్ కోరుకున్న విధంగా ఇరాన్ లో రెజీమ్ చేంజ్ కు మితవాదన నాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇస్లామాబాద్ లో జరుగుతున్న చర్చల్లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ముఖాముఖి చర్చలు ఉండవని ఇరాన్ స్పష్టం చేసినా, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ, అమెరికా ప్రతినిధి కుష్నర్ విడిగా అరగంట పాటు చర్చించుకోవడం విశేషం.

పాక్.. ద్వంద్వనీతి

పాక్ లో జరుగుతున్న చర్చలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఐఎస్ఐ అధికారులు ఐఆర్జీసీకి అప్ డేట్ చేస్తున్నారు. దీనివల్ల మితవాద రాజకీయనేతలపై ఆ వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతున్నది. చివరికి మంత్రుల నియామకంలోనూ ఐఆర్జీసీ కఠినంగా వ్యవహరిస్తున్నదని, ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ చేపడుతున్న నియామకాలను సైతం తోసిపుచ్చుతున్నదన్న వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీకి పూర్తి మద్దతు ఇస్తున్న చైనా.. పాక్ ఎత్తుగడలను ఉపేక్షిస్తుందా? అన్న వాదనలు కూడా వస్తున్నాయి. కానీ, పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. మొన్నటివరకు సిల్క్ రూట్ (సీ పెక్) భద్రత కోసం బలూచిస్తాన్‌లో తమ ఆర్మీని దింపడానికి కూడా వెనుకాడమని చైనా హెచ్చరించినా.. నోరెత్తని స్థితిలో ఉన్న పాక్.. ఇప్పుడు అదే సీ పెక్ విషయంలో చైనాను గడగడలాడిస్తున్నది. తమ ఆర్మీని కొద్దిసేపు పక్కకు తప్పిస్తే.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఇంజినీర్లు, వర్కర్లను మౌలికసదుపాయాలను నాశనం చేస్తారని బెదిరిస్తున్నది. 62 బిలియన్ డాలర్ల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపు 40బిలియన్లకుపైగా డాలర్లు వెచ్చించిన చైనా.. ఇప్పుడు పాక్ చెప్పిన షరతులకు అంగీకరించాల్సి వస్తున్నది. ఇక్కడ డబ్బు కంటే ఈ రూట్ చైనాకు అత్యంత అవసరం కావడంతో.. పాక్ ఆడుతున్న నాటకాలను భరించాల్సి వస్తున్నదన్న వాదనలకు బలం చేకూరుతున్నది.

ట్రంప్ ఫ్యామిలీతో క్విడ్ ప్రో కో

ఒకరినుంచి ఏదైనా ఆశించి లబ్ధి చేకూర్చడాన్ని క్విడ్ ప్రో కో అంటారు. ఇప్పుడు పాక్-ట్రంప్ సంబంధాలను చూస్తే అదే విషయం అర్థం అవుతుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కు అనూహ్యంగా ఐఎంఎఫ్ నుంచి బిలియన్ డాలర్ల సాయం లభించింది. అయితే, ఆ సాయం అక్కడి పేదలకు ఆహారం, వైద్యం కోసం కాకుండా.. ట్రంప్ ఫ్యామిలీకి చెందిన క్రిప్టో కరెన్సీ కంపెనీలో పెట్టుబడిగా పెట్టింది. ఇందుకోసం పాక్ ప్రభుత్వం (ఫైనాన్స్ మినిస్టర్ ముహమ్మద్ ఔరంగజేబ్) జనవరి 2026లోనే ట్రంప్ ఇద్దరు కుమారుల ఆధ్వర్యంలో నడుస్తున్న డిజిటల్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌ అనే క్రిప్టో కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నది.

చాబహార్ వదులుకుంటున్న భారత్

ఇరాన్ లో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. చాబహార్ పోర్ట్‌లో పెట్టుబడి పెట్టిన భారత్.. ఇప్పుడు ఆ పోర్ట్ బాధ్యతలనుంచి తప్పుకోవాలని చూస్తున్నది. పెట్టుబడులు తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై చర్చిస్తు్న్నది. మొదటి విడత సీజ్ ఫైర్ మొదలైన కొద్దిరోజుల్లోనే భారత నౌకలపై ఐఆర్జీసీ స్పీడ్ బోట్లు కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత్.. రష్యా మధ్యవర్తిత్వం కోరినా ఫలితం లభించలేదు. దీంతో ఇరాన్ లో పెట్టుబడులనుంచి వెనక్కిపోవడంతోపాటు పరిస్థితులు చక్కబడేవరకూ ఇరాన్ రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

Next Story