పెళ్లింట డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన నవ వధువు.. గుండెపోటుతో మృతి

by Ramesh Naini |

వివాహ వేడుకలో బంధువులతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఒక నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచిన అత్యంత విషాదకర ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పెళ్లింట డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన నవ వధువు.. గుండెపోటుతో మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివాహ వేడుకలో బంధువులతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఒక నవవధువు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచిన అత్యంత విషాదకర ఘటన రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే యువతి మృత్యువాత పడటంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. జలోర్ జిల్లా బాగోడా పరిధిలోని మోర్సిమ్ గ్రామానికి చెందిన జవారామ్ పురోహిత్ కుమారుడు లుంభారామ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. లుంభారామ్ కుమార్తె మమత వివాహం జరగాల్సి ఉంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వాటేరా గ్రామానికి చెందిన దీపిక అలియాస్ దీపు రాజ్‌పురోహిత్ (22) తన పుట్టింటికి (మోర్సిమ్) వచ్చింది. దీపికకు కేవలం నాలుగు నెలల క్రితమే వివాహమైంది. పెళ్లి తర్వాత ఆమె హాజరవుతున్న తొలి శుభకార్యం ఇదే కావడంతో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంది. సోమవారం రాత్రి ఇంట్లో ‘బందోలి’ కార్యక్రమం జరుగుతోంది. బంధువులు, స్నేహితులతో కలిసి దీపిక ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తోంది. కాసేపటికే ఆమెకు అకస్మాత్తుగా వేదికపైనే అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

శోకసంద్రంలో పెళ్లిల్లు..

వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను మోర్సిమ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం బాగోడా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే దీపిక తుదిశ్వాస విడిచింది. గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) వల్లే ఆమె మరణించి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపించిన యువతి క్షణాల్లో విగతజీవిగా మారడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఆనందంతో కోలాహలంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకముందే దీపిక మృతి చెందడంతో పుట్టింటి, అత్తింటి సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, దీపిక డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం పట్ల నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Next Story