మొబైల్ డేటా యూసేజ్‌లో సరికొత్త రికార్డులు.. టాప్ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు మాయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-16 10:27:45  IST  )

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొబైల్ డేటా వాడకం రికార్డు స్థాయిలో పెరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

మొబైల్ డేటా యూసేజ్‌లో సరికొత్త రికార్డులు.. టాప్ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు మాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ (Internet) లేకపోతే క్షణం కూడా పొద్దు గడవడం లేదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగంలో భారత్ (India) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో సగటున ఓ వ్యక్తి నెలకు ఎంత మొబైల్ డేటా ఉపయోగిస్తున్నాడనే అంశంపై ఇటీవల కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెలికాం నివేదికలు నోకియా MBiT, ఎరిక్సన్ మొబిలిటీ ప్రకారం.. దేశంలో ఒక్కో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వాడకం ఏకంగా 31 GB నుంచి ఏకంగా 33 GBకు చేరింది. దేశంలో శరవేగంగా 5జీ సేవలు అందుబాటులోకి రావడం 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్, రీల్స్, షార్ట్స్ క్రేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్‌ల వాడకం పెరగడమే దీనికి ప్రధాన కారణాలని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా సగటు నెలవారీ మొబైల్ డేటా వినియోగంలో అరుణచల్ ప్రదేశ్ 33.6 జీబీతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత సిక్కిం 32.4 జీబీ, లక్షద్వీప్ 29.3 జీబీ, గుజరాత్ 28.5 జీబీ, బిహార్ 24.2 జీబీ, ఉత్తరప్రదేశ్ 23.9, తమిళనాడు, 23.7 జీబీ, మహారాష్ట్ర 23.3 జీబీ, కేరళ 23.0 జీబీ, కర్ణాటక 21.8 జీబీ, హర్యానా 21.1 జీబీ, ఢిల్లీ 14.9 జీబీ, తెలంగాణ 14.8 జీబీ, ఆంధ్రప్రదేశ్ 14.6 జీబీతో ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన డేటా వాడకం..

అయితే, నోకియా MBiT, ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లక్షద్వీప్ వంటి ప్రాంతాలు టాప్ స్థానాల్లో దూసుకుపోతుండగా.. ఐటీ, సాంకేతిక రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు టాప్ 8 స్థానాల్లో కూడా కనిపించకపోవడం గమనార్హం. సాధారణంగా టెక్నాలజీని విపరీతంగా వాడే తెలుగు రాష్ట్రాల యువత మొబైల్ డేటా వాడకాన్ని తగ్గించడం, ఇక్కడ సగటు తక్కువగా నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చదవు, స్కిల్స్‌పై యూత్ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇళ్లలోనే కాకుండా ఆఫీసులు, విద్యాసంస్థలు, పబ్లిక్ ప్రదేశాల్లో బ్రాడ్‌బ్యాండ్ వైఫై కనెక్షన్ల వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో యువత మొబైల్ డేటా కంటే అన్‌లిమిటెడ్ వైఫై నెట్‌వర్క్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా, రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, తెలుగు యువత ఎక్కువగా ఉపాధి, స్కిల్స్, ఉన్నత చదువులపై దృష్టి పెడుతుండటం వల్ల మొబైల్ స్క్రీన్ టైమ్, డేటా వినియోగం తగ్గిందని టెక్ నిపుణులు పెర్కొంటున్నారు. మితిమీరిన మొబైల్ వాడకంతో వచ్చే అనర్థాలపై యువతలో ఓ అవగాహన రావడంతో మొబైల్ డేటా వినియోగా బాగా తగ్గిందని తెలుస్తోంది.

వెనుకబాటుతనం కాదు.. స్మార్ట్ వాడకం

డిజిటల్ చెల్లింపులు (UPI), ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-గవర్నెన్స్ సేవలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి కొండ ప్రాంతాల్లో, లక్షద్వీప్ వంటి దీవుల్లో బ్రాడ్‌బ్యాండ్ లైన్లు వేయడం శ్రమకు మించిన భారం కావడంతో అక్కడ మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉందని టెక్ నిపుణలు చెబుతున్నారు.

Next Story