కొత్త IRCTC వెబ్‌సైట్..! విద్యార్థుల ఫిర్యాదుపై రైల్వే మంత్రి కీలక నిర్ణయం

by Ramesh Naini |

రైలు ప్రయాణికులకు మరింత సులువైన, వేగవంతమైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు జూలై 15 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

కొత్త IRCTC వెబ్‌సైట్..! విద్యార్థుల ఫిర్యాదుపై రైల్వే మంత్రి కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైలు ప్రయాణికులకు మరింత సులువైన, వేగవంతమైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు జూలై 15 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT)లో జరిగిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న కాప్చా (CAPTCHA) వెరిఫికేషన్ ఇబ్బందులను ఒక విద్యార్థి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన అశ్విని వైష్ణవ్.. అక్కడికక్కడే అధికారులతో సంప్రదించి, నెల రోజుల్లోగా (జూలై 15 లోపు) ఆధునిక ఫీచర్లతో కూడిన కొత్త వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం రైలు టికెట్లు ఆన్‌లైన్ వేదికల ద్వారానే బుక్ అవుతుండటం గమనార్హం.

సరిహద్దుల్లో ఆకాశవాణి సేవలు

జాతీయ భద్రత, సాంకేతిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని MNIT జైపూర్‌లో అత్యాధునిక ‘అడ్వాన్స్‌డ్ క్వాంటం కంప్యూటింగ్ ల్యాబొరేటరీ’ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఇక్కడి విద్యార్థులకు సెమీకండక్టర్ శిక్షణ కోసం ‘సెమివర్స్’ ప్లాట్‌ఫామ్ యాక్సెస్ కల్పిస్తామన్నారు. అలాగే జైసల్మేర్‌ సరిహద్దు ప్రాంత ప్రయోజనాల కోసం రామ్‌గఢ్‌లో 20 కిలోవాట్ల కొత్త ఆకాశవాణి ఎఫ్‌ఎమ్ (FM) ట్రాన్స్‌మిటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఇది దాదాపు 80 కిలోమీటర్ల రేడియస్ పరిధిలోని ప్రజలకు విజ్ఞాన, వినోద కార్యక్రమాలను చేర వేయనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రసార భారతి ‘డిజిటల్ ఫస్ట్’, ‘హైపర్-లోకల్’ విధానాన్ని అవలంబించాలని ఆయన సూచించారు.

Next Story