ఏప్రిల్ 1st నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం: అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!

by Gantepaka Srikanth |

దేశ ఆర్థిక వ్యవస్థలో మరో చారిత్రక మార్పునకు సమయం ఆసన్నమైంది.

ఏప్రిల్ 1st నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం: అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థలో మరో చారిత్రక మార్పునకు సమయం ఆసన్నమైంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు సామాన్యుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు అందరిపై ప్రభావం చూపనున్నాయి. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత పన్ను చట్టం స్థానంలో నూతన చట్టం రాబోతుండటంతో పాటు, కార్మిక చట్టాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు 65 ఏళ్లుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకువచ్చింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సరళతరం చేయడం, అనవసరమైన క్లిష్టతలను తొలగించడం. ఇప్పటి వరకు ఉన్న 'ఫైనాన్షియల్ ఇయర్' (FY), 'అసెస్మెంట్ ఇయర్' (AY) అనే గందరగోళ పదాలకు బదులుగా, ఇకపై కేవలం 'ట్యాక్స్ ఇయర్' (Tax Year) అనే పదాన్నే వాడనున్నారు.

ఉపశమనం..

ఇప్పటి వరకు కేవలం నాలుగు మెట్రో నగరాలకే (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై) పరిమితమైన 50% పన్ను మినహాయింపు పరిధిని ఇప్పుడు మరిన్ని నగరాలకు విస్తరించారు. హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలను కూడా 50% హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు జాబితాలో చేర్చారు. దీనివల్ల ఈ నగరాల్లో పనిచేసే లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ మరియు ఇతర ఉద్యోగులకు భారీగా పన్ను ఆదా కానుంది.

కొత్త లేబర్ కోడ్..

ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. దీని ప్రకారం.. ఉద్యోగి మొత్తం జీతంలో (CTC) బేసిక్ పే కచ్చితంగా 50% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. బేసిక్ పే పెరగడం వల్ల ఉద్యోగి పీఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ నిధులు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల చేతికి వచ్చే జీతం (Take-home salary) స్వల్పంగా తగ్గినప్పటికీ, రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో నిధి జమ అవుతుంది. కొత్త చట్టం ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియను మరింత డిజిటలైజ్ చేశారు. ఫామ్స్‌ను సరళతరం చేయడం ద్వారా ట్యాక్స్ పేయర్లు స్వయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటర్న్స్ దాఖలు చేసేలా మార్పులు చేశారు. ఈ మార్పులు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు.. ముఖ్యంగా ఐటీ రంగ నిపుణులకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఒకవైపు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపులతో పన్ను భారం తగ్గనుండగా, మరోవైపు లేబర్ కోడ్ వల్ల భవిష్యత్తు కోసం పొదుపు పెరగనుంది.

Next Story