Digital India: కొత్త ఆధార్ యాప్ జాతికి అంకితం.. ఫీచర్లు ఇవే

by Naga Rani Yarlagadda |

భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నూతన ఆధార్ యాప్‌ను ప్రారంభించింది.

Digital India: కొత్త ఆధార్ యాప్ జాతికి అంకితం.. ఫీచర్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నూతన ఆధార్ యాప్‌ను ప్రారంభించింది. న్యూఢిల్లీ జన్‌పథ్‌లోని డా. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నూతన ఆధార్ యాప్ ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశానికి అంకితం చేశారు. ఈ యాప్‌ ద్వారా పౌరులకు గుర్తింపు సేవలు మరింత సులభంగా, సురక్షితంగా, వినియోగదారులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిజిటల్ సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

డిజిటల్ మార్పుపై ప్రధాని సందేశం

ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యూపీఐ, ఆధార్, డిజిలాకర్ వంటి ఓపెన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సేవలను మరింత సమగ్రమైనవి, పారదర్శకమైనవి, అందరికీ చేరువైనవిగా మార్చాయని పేర్కొన్నారు. “అందరికీ వేదిక, అందరికీ పురోగతి” అనే దృక్పథాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

నూతన ఆధార్ యాప్ ముఖ్య ఫీచర్లు

ఈ ఆధార్ యాప్‌లో పౌరులకు ఉపయోగపడే పలు వినూత్న సదుపాయాలు ఉన్నాయి.

గుర్తింపు వివరాలను ఎంపిక చేసుకుని మాత్రమే షేర్ చేసే సౌలభ్యం

గరిష్టంగా ఐదుగురి ప్రొఫైల్స్ సృష్టించే అవకాశం

తక్షణ ఆధార్ వెరిఫికేషన్

ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ ఫీచర్

మొబైల్ నంబర్ అప్‌డేట్ ఆప్షన్

ఆధార్ కాంటాక్ట్ కార్డు ద్వారా సురక్షితంగా సంప్రదింపు వివరాల షేరింగ్

వినియోగదారులకు అనుకూలమైన ఇంటర్‌ఫేస్

డిజిటల్ గుర్తింపు సేవలకు కొత్త ఊతం

ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే డిజిటల్ గుర్తింపును చూపించటం, షేర్ చేయటం, ధృవీకరించటం సులభమవుతుంది. క్యూఆర్‌ కోడ్ ఆధారిత వెరిఫికేషన్‌తో పాటు భద్రతకు పెద్దపీట వేసిన ఈ యాప్‌, భౌతిక పత్రాలపై ఆధారాన్ని తగ్గించనుంది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దృక్పథంలో భాగం

ఈ నూతన ఆధార్ యాప్ ప్రారంభం, విశ్వసనీయ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, పౌరుల సాధికారత పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో ఆధార్‌ను కీలక మౌలిక గుర్తింపు వేదికగా మరింత బలోపేతం చేసే దిశగా ఇది ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు.

Next Story