- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదే మీకు మంచి అవకాశం : ఇరానీయులకు నెతన్యాహు మరో సంచలన సందేశం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పౌరులను ఉద్దేశించి మరో సంచలన సందేశం ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పౌరులను ఉద్దేశించి మరో సంచలన సందేశం ఇచ్చారు. ఇరాన్‌లోని నిరంకుశ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అక్కడి ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి పోరాడాలని, నాయకత్వాన్ని మార్చుకోవాలని సూచించారు. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' (Operation Rising Lion)లో భాగంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనేత ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. ఈ దాడుల ద్వారా ఇరాన్‌లో అధికార మార్పిడికి మార్గం సుగమమైందని చెబుతూ నెతన్యాహు ఆదివారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘రాబోయే రోజుల్లో ఇరాన్‌లోని ఉగ్రవాద ప్రభుత్వానికి చెందిన వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తాం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు నిరంకుశ సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకే ఈ ఆపరేషన్ చేపట్టాం’ అని ఆయన స్పష్టం చేశారు.
లక్షలాదిగా వీధుల్లోకి రండి..
ప్రతి తరంలో ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుందని, కాబట్టి ఎవరూ మౌనంగా ఉండొద్దని అన్నారు. పౌరులంతా లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి నిరంకుశ వ్యవస్థను కూల్చేయండని పిలుపునిచ్చారు. పర్షియన్లు, కుర్ద్‌లు, అజెరీలు, అహ్వాజీలు, బలూచీలు తదితర వర్గాల వారంతా ఏకమై ఇరాన్ భవిష్యత్తు కోసం సమిష్టిగా పోరాడాలని ఆయన కోరారు. ఇరాన్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విదేశీ మద్దతు ఇప్పుడు లభించిందని, వారి ఆకాంక్షలు నెరవేరే సమయం ఆసన్నమైందని భరోసా ఇచ్చారు.
లక్ష్యం కాదు.. కానీ ఫలితం అదే!
ఇరాన్ ప్రభుత్వ మార్పు అనేది తమ సైనిక లక్ష్యమా? అన్న ప్రశ్నకు నెతన్యాహు స్పందిస్తూ.. అది మా ప్రాథమిక లక్ష్యం కాదు, కానీ కచ్చితంగా దాడుల ఫలితం అదే అవుతుందని బదులిచ్చారు. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను నాశనం చేయడమే తమ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని, అయితే నిరంతర సైనిక ఒత్తిడి వల్ల ఇరాన్‌లో రాజకీయ పెనుమార్పులు చోటుచేసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమ తలరాతను తామే మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.






