అధికారంపై మక్కువ లేదు.. ఆరు నెలల్లో అప్పగించేస్తా: సుశీల కర్కి

by Phanindra |

అధికారంపై తనకు మక్కువ లేదని, ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేపాల్‌ను వారికి అప్పగించేస్తానని తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి అన్నారు.

అధికారంపై మక్కువ లేదు.. ఆరు నెలల్లో అప్పగించేస్తా: సుశీల కర్కి
X

దిశ, నేషనల్ బ్యూరో: తనకు, తన బృందానికి అధికారంపై ఎలాంటి మక్కువ లేదని నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి స్పష్టంచేశారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించి, అప్పుడు ఏర్పాటైన కొత్త పార్లమెంటుకు అధికారాన్ని అప్పగించేస్తామని ఆమె తెలిపారు. తమ బృందం ఆరు నెలలకు మించి అధికారంలో ఉండబోదని ఆమె స్పష్టంచేశారు. అవినీతికి వ్యతిరేకంగా చేసిన జెన్ జీ నిరసనలను ఆమె ప్రశంసించారు. ఈ నిరసనల్లో మరణించిన వారిని అమరులుగా గుర్తిస్తామని, వారి కుటుంబాలకు 10 లక్షల నేపాలీ రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ఆమె ప్రకటించారు.

ఈ ఆందోళనల్లో గాయాలపాలైన వారి వైద్య ఖర్చులను భరించడంతోపాటు వారిని ఆర్థికంగా ఆదుకునే బాధ్యతను కూడా తమ తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆందోళనల పేరుతో పథకం ప్రకారం ప్రణాళికలు అమలు చేసినట్లు కనిపిస్తోందన్న ఆమె.. వ్యక్తిగత ఆస్తులు నష్టపోయిన వారిని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. నేపాల్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఈ పరిస్థితిని చక్కదిద్దడమే తాత్కాలిక ప్రభుత్వం ముందున్న ప్రధాన అంశమని పేర్కొన్నారు.

Next Story