నెహ్రూ లేఖలు దేశ ఆస్తి, వాటిని తిరిగి ఇచ్చేయండి: సోనియా గాంధీకి కేంద్ర మంత్రి విజ్ఞప్తి

by Malleboina Mahesh |

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

నెహ్రూ లేఖలు దేశ ఆస్తి, వాటిని తిరిగి ఇచ్చేయండి: సోనియా గాంధీకి కేంద్ర మంత్రి విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (First Prime Minister Jawaharlal Nehru)కు సంబంధించిన కీలక పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాటిని వెంటనే 'ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ' (PMML)కి తిరిగి అప్పగించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Minister Gajendra Singh Shekhawat) ఆదివారం (డిసెంబర్ 28, 2025) మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఆ పత్రాలు ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో చెందిన ప్రైవేట్ ఆస్తి కాదని, అవి దేశ వారసత్వ సంపద అని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇందిరా గాంధీ భద్రత కోసం వీటిని మ్యూజియానికి అప్పగించారని, అయితే 2008లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఆదేశాల మేరకు 51 పెట్టెల్లో (దాదాపు 26,000 పత్రాలు) వీటిని ఆమె నివాసానికి తరలించారని షెకావత్ వెల్లడించారు.

ఈ పత్రాలలో నెహ్రూ రాసిన వ్యక్తిగత లేఖలు, ఆయనకు వచ్చిన సమాధానాలు, ముఖ్యమైన నోట్స్ ఉన్నాయని, ఇవి పరిశోధకులకు, చరిత్రకారులకు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈ పత్రాల కోసం మ్యూజియం ఇప్పటికే 2025 జనవరి, జూలైలో రెండుసార్లు సోనియా గాంధీకి లేఖలు రాసిందని, ఆమె కూడా సహకరిస్తానని సమాధానం ఇచ్చారని, కానీ ఇంతవరకు అవి తిరిగి రాలేదని ఆయన గుర్తుచేశారు. దేశ చరిత్రను నిష్పాక్షికంగా తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని, కాబట్టి వాటిని పబ్లిక్ ఆర్కైవ్స్‌లో ఉంచాలని ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిమాండ్ చేశారు.

Next Story