నీట్ యూజీ రీ టెస్ట్ : రంగంలోకి పీఎంఓ.. పేపర్ నుంచి సెంటర్ వరకు కట్టుదిట్టమైన నిఘా!

by Ramesh Naini |

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.

నీట్ యూజీ రీ టెస్ట్ : రంగంలోకి పీఎంఓ.. పేపర్ నుంచి సెంటర్ వరకు కట్టుదిట్టమైన నిఘా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET-UG 2026) ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహణపై దృష్టి సారించింది. జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామినేషన్‌ను పక్కాగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నేరుగా రంగంలోకి దిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్‌టీఏ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్‌తో పాటు పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పీఎంఓ ప్రత్యక్ష పర్యవేక్షణ..

ప్రశ్నపత్రాల రూపకల్పన (Paper Setting), ప్రింటింగ్, రవాణా నుంచి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల చేతికి అందే చివరి నిమిషం వరకు ప్రతి దశను పీఎంఓ అధికారులు నిశితంగా పర్యవేక్షించనున్నారు. నీట్ రీ టెస్ట్ ఏర్పాట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా దృష్టి సారించారు. పరీక్షకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఆయన నిరంతరం అడిగి తెలుసుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు రాగానే ప్రధాని ఆదేశాల మేరకే ఆ పరీక్షను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో ఈసారి భద్రతను మునుపెన్నడూ లేనంత కట్టుదిట్టం చేస్తున్నారు.

కఠినమైన నిఘా నీడలో రీ టెస్ట్..

దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు రాయబోతున్న ఈ రీ టెస్ట్ కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష విశ్వసనీయతను కాపాడేందుకు, చరిత్రలోనే అత్యంత కఠినమైన నిఘా నీడలో జూన్ 21న ఈ పరీక్షను నిర్వహించేందుకు పలు ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు సర్వసన్నద్ధమవుతున్నాయి.

Next Story