నీట్ యూజీ రీఎగ్జామ్‌ - విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్న అధికారులు

by Kema Shiva Kumar |

కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశవ్యాప్తంగా కాసేపట్లో నీట్ యూజీ (NEET UG) రీఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది.

నీట్ యూజీ రీఎగ్జామ్‌ - విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్న అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ (NEET UG 2026) రీఎగ్జామ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులను నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్టీఏ పలు కఠిన నిబంధనలను విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

మధ్యాహ్నం 1.30 దాటితే నో ఎంట్రీ..

మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు. నగరాల్లో ఉండే ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు సూచించిన టైమ్ కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రధాన కేంద్రాల్లో నీట్ రీఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ (JNTU), యూసఫ్‌గూడల్లోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డులు (Admit Cards), ఒరిజినల్ గుర్తింపు పత్రాల (ID Proofs)ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. గతంలో జరిగిన వివాదాల దృష్ట్యా ఈసారి నీట్ యూజీ రీఎగ్జామ్‌ను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ కేటాయింపులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story