ఎల్కతుర్తి మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతిపత్రం

by Jakkula.Mamatha |

ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి, ఎల్కతుర్తి మండల కేంద్రంలో అగ్నిమాపక(ఫైర్) స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు.

ఎల్కతుర్తి మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతిపత్రం
X

దిశ,ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి, ఎల్కతుర్తి మండల కేంద్రంలో అగ్నిమాపక(ఫైర్) స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎల్కతుర్తి మండలంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు చేరుకునేలోపే విలువైన ప్రాణాలు, ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎల్కతుర్తి మండలంతో పాటు ధర్మసాగర్, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల ప్రజలకు కూడా అత్యవసర సమయంలో వేగంగా అగ్నిమాపక సేవలు అందుతాయని, తద్వారా ఐదు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.

అలాగే జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగే వాహన ప్రమాదాలు, పరిశ్రమలు, గోదాములు, వ్యవసాయ క్షేత్రాల్లో సంభవించే అగ్ని ప్రమాదాలకు కూడా తక్షణ స్పందన అందించేందుకు ఈ ఫైర్ స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖ అధికారులతో చర్చించి ఫైర్ స్టేషన్ మంజూరు కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పుల్లూరి శ్రీధర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు ముప్పు శ్రీను, ముస్కె శ్రీనివాస్, పెండ్యాల భాస్కర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ బక్కి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story