- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Memories : నిశ్శబ్ద త్యాగాల శిఖరం.. మా నాన్న
అమ్మ ప్రేమ ఆమె కన్నీళ్లలో, ఆమె వాత్సల్యంలో కనిపిస్తే.. నాన్న ప్రేమ అతని అరిగిపోయిన చెప్పుల్లో, చిరిగిపోయిన చొక్కాలో, అలసిపోయిన శరీరంపై చెమట చుక్కల్లో కనిపించేది నాకు.

దిశ, ఫీచర్స్ : నడక నేర్చిన తొలిరోజుల్లో నాన్న వేలు పట్టి నడుస్తూ.. ఎన్ని గారాలు పోయేవాడివిరా నువ్వు.. అంటూ ఆ రోజులను గుర్తు చేస్తూ అమ్మ చెప్పిన అనుభవాల కథలు వింటుంటే.. కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నాన్న జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు సుడులుగా తిరుగుతూ మదిని తడుముతున్నాయి. నిజమే.. నాన్న ఉన్న రోజుల్లో నన్ను ఎంత బాగా చూసుకునేవాడో అసలు. నాన్న ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. కానీ ఏం చేస్తాం..! కాలం కఠినంగా వ్యవహరించింది. అనారోగ్యంతో పోరాడుతూ ఆరేండ్ల కిందట.. అకాల మరణం చెందాడు నాన్న.
ఆ రోజులు గుర్తుకు వచ్చి..
అనుకోకుండా ఆల్బమ్ తిరగేస్తుంటే.. నాన్న ఫొటో కనబడింది. ఆ రోజులు గుర్తుకు వచ్చి అమ్మ, నేను, నా కుటుంబం అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయాం. ఆ తర్వాత నాన్నతో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఏవేవో ఊహల్లో మునిగిపోయాను నేను. నాకే కాదు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాన్నంటే ఎంతో ప్రత్యేకం. నాన్నంటే ఒక ధైర్యం. నాన్నంటే ఒక ఆత్మ విశ్వాసం. నాన్నంటే ఒక సర్వస్వం. నాకూ అంతే.. నాజీవితంలోనూ అంతే. ఇంకా అంతకంటే ఎక్కువే. నాన్న నాకోసం ఎంత పరితపించేవాడో, నన్ను ఎంతగా ప్రేమించేవాడో, నా కోసం, మా కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసేవాడో.. అన్నీ గుర్తుకు వస్తున్నాయ్.. నిజం చెప్పాలంటే నిశ్శబ్ద త్యాగాల శిఖరం మా నాన్న. అమ్మ ప్రేమ అనురాగాల పల్లవి అయితే.. నాన్న ప్రేమ బాధ్యతల చరణమై అలరించింది నన్ను. నాన్న బతికున్న రోజులు యాదికొస్తే కన్నీళ్లు ఆగవు నిజంగా..
నాన్నే పరిష్కారం..
అమ్మ ప్రేమ ఆమె కన్నీళ్లలో, ఆమె వాత్సల్యంలో కనిపిస్తే.. నాన్న ప్రేమ అతని అరిగిపోయిన చెప్పుల్లో, చిరిగిపోయిన చొక్కాలో కనిపించేది. పొద్దస్తమానం చేసే వ్యవసాయ పనుల్లో, పని చేసీ చేసీ అలసిపోయిన అతని శరీరంపై పేరుకుపోయిన చెమట చుక్కల్లోనూ అంతం లేని ప్రేమ కనిపించేది నాకు. కరువొచ్చినా, కష్టమొచ్చినా, అప్పులెక్కువైనా, అనారోగ్యాలు సంభవించినా.. ఇలా ప్రతీ సందర్భంలో నాకు, మా కుటుంబం మొత్తానికి గొప్ప పరిష్కార మార్గం నాన్న మాత్రమే. మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి లోలోపల ఎన్ని బాధలు భరించేవాడో నాన్న.. అందరం బాగుండాలని ఎన్ని ఆటంకాల సుడిగుండాలను ఈదేవాడో నాన్న, మమ్మల్ని సంతోషంగా ఉంచాలని ఎన్ని సమస్యల సముద్రాలను దాటేవాడో నాన్న.
నాన్నే ధైర్యం..
చిన్నప్పుడు అంత లోతైన అవగాహన ఉండకపోయేది నాకు కానీ.. ఈ ప్రపంచాన్ని పరిశీలించడం మొదలు పెట్టాక. ప్రపంచమంతా నాకు అర్థమయ్యాక. నేను కూడా ఒక నాన్న పాత్రలోకి ఒదిగిపోయాక.. నాన్న గొప్పదనం, నాన్న ప్రేమ ఎంత గొప్పదో తల్చుకుంటేనే కన్నీళ్లు ఆగుతలేవు.. ఇప్పటికీ నాన్న జ్ఞాపకాలు నాకు ధైర్యాన్నిస్తుంటాయి. నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంటాయి. నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ మోటివేషన్ చేస్తుంటాయి. నువ్వు ప్రత్యక్షంగా ఉంటే ఇంకా ఎంత బాగుండేది నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే
మొహమ్మద్ జునైద్






