- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ, కాంగ్రెస్ మధ్య లెటర్ వార్.. రాహుల్ గాంధీ అపాయింట్‍మెంట్ కోసం సీఎంకు బీజేపీ లేఖ
తెలంగాణ రాజకీయాల్లో లేఖల రాజకీయం ముదురుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ లేఖాస్త్రాలు హాట్ టాపిక్‍గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం ఆసక్తి రేపుతోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య లేఖల యుద్ధం సంచలనంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాస్తుండగా బీజేపీ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం:
గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులను తనకున్న పలుకుబడిని ఉపయోగించి అడ్డుకుంటున్నారని సీఎం ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అంతే ఘాటుగా కిషన్ రెడ్డి సైతం స్పందిస్తున్నారు. దీంతో ఇద్ధరి మధ్య మాటల యుద్ధం రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తున్న వేళ ఇప్పుడు లేఖల రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది. మేడిగడ్డ విషయంలో చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం అపాయింట్‍మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే కిషన్ రెడ్డికి లేఖ రాయగా మొన్న మరోసారి లేఖ రాస్తూ.. ఈసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తాను ఈ నెల 22,23 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటానని ఆ సమయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం కోసం అపాయింట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ముందు రాహుల్ గాంధీ అపాయింట్మెట్ ఇప్పించు:
కిషన్ రెడ్డిపై లేఖాస్త్రాలు ప్రయోగిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ సైతం అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు. కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చేటప్పుడు తప్ప .. తీర్చేటప్పుడు పత్తా లేరా అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి? ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా.. మహిళలకు నెలకు రూ.2,500, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000, విద్యార్థులకు విద్యా భరోసా అందలేదన్నారు. నిరుద్యోగులకు రూ.4,000 భృతి అతీగతీ లేదని వృద్ధులకు రూ.4,000 పెన్షన్ దక్కలేదని విమర్శఇంచారు. ఈ నెరవేరని వాగ్దానాలపై రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకత్వం భయపడితే.. అది తెలంగాణ ప్రజలను వారు ఘోరంగా వంచించారని ఒప్పుకున్నట్లేనన్నారు.






