నీట్‌ పేపర్‌ లీక్‌ కుంభకోణం.. కీలక సూత్రధారిగా పుణె బ్యూటీషియన్!

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

నీట్‌ పేపర్‌ లీక్‌ కుంభకోణం.. కీలక సూత్రధారిగా పుణె బ్యూటీషియన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ (NEET-UG) పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ భారీ కుంభకోణం వెనుక పుణెకు చెందిన 46 ఏళ్ల బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు సీబీఐ (CBI) దర్యాప్తులో వెల్లడైంది. ఎన్టీఏ (NTA) ప్యానల్ సభ్యులతో చేతులు కలిపి ఆమె ఈ దందా నడిపినట్లు అధికారులు గుర్తించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రధాన సూత్రధారులు, వారి పాత్ర..

సీబీఐ దర్యాప్తు ప్రకారం.. పుణెలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మనీషా వాఘ్మారే, పేపర్ లీక్ కుట్రలో ‘కామన్ లింక్’గా వ్యవహరించింది. కోచింగ్ కావాల్సిన విద్యార్థులను, ప్రొఫెసర్లను ఒకచోట చేర్చింది. ఒక్కో విద్యార్థి వద్ద రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని, అందులో రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు లాభంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 14న అరెస్టయిన ఈమె ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉంది.

ప్రొఫెసర్స్ మనీషా గురునాథ్ మందరే, పీవీ కులకర్ణి..

నీట్ ప్రశ్నపత్రం తయారీ ప్యానల్‌లో మనీషా గురునాథ్ మందరే సభ్యురాలు. తనకు ఉన్న యాక్సెస్ ద్వారా బోటనీ, జువాలజీ పేపర్లను ముందే సంపాదించి వాఘ్మారేతో కలిసి లీక్ చేసింది. ఈ కేసులో ఈమెను మరో ‘మాస్టర్ మైండ్’గా సీబీఐ పేర్కొంది. అలాగే రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన ఇతను కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉండి, విద్యార్థులను వెతకడంలో వాఘ్మారేకు సహకరించాడు.

పేపర్ చేతులు మారింది ఇలా..

లీకైన పేపర్లను బ్యూటీషియన్ వాఘ్మారే తన స్నేహితుడైన ధనంజయ్‌ లోఖండేకు అందజేసింది. అతడు నాసిక్‌లో కౌన్సెలింగ్‌ సెంటర్ నడుపుతున్న శుభమ్ ఖైర్నార్‌ను సంప్రదించాడు. శుభమ్ ఈ పేపర్లను పీడీఎఫ్ (PDF) రూపంలో గురుగ్రామ్‌, జైపుర్‌లోని ఏజెంట్లకు, విద్యార్థులకు పంపాడు. ఈ వ్యవహారంలో మొదట అరెస్ట్ అయింది శుభమ్ ఖైర్నార్ కావడం గమనార్హం.

తాజాగా లాతూర్‌లో మరో అరెస్టు..

ఈ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా లాతూర్‌కు చెందిన ‘రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్‌’ (RCC) ఫౌండర్ శివరాజ్ రఘునాథ్‌ను అరెస్టు చేశారు. శివరాజ్ ఫోన్‌లో లీకైన నీట్ ప్రశ్నపత్రం ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. పేపర్లను ఇతర విద్యార్థులకు చేరవేసిన ముఠాలో ఇతను కూడా కీలక సభ్యుడని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించింది.

Next Story