నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. సీబీఐ వలలో మరో మాస్టర్‌మైండ్‌ మనీషా

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌- యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు స్పీడప్ చేసింది.

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. సీబీఐ వలలో మరో మాస్టర్‌మైండ్‌ మనీషా
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌- యూజీ (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు స్పీడప్ చేసింది. తాజాగా ఈ స్కామ్‌లో మరో మాస్టర్‌మైండ్‌, పుణెకు చెందిన సీనియర్‌ బోటనీ టీచర్‌ మనీషా గుర్‌నాథ్ మాంధరేను సీబీఐ అరెస్ట్ చేసింది. బయాలజీ (బోటనీ, జువాలజీ) పేపర్ల లీకేజీకి ఈమెనే ప్రధాన సూత్రధారి అని అధికారులు నిర్ధారించారు.

మనీషా ఎలా లీక్ చేసింది?

సీబీఐ నివేదికల ప్రకారం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిపుణుల బృందంలో ఉండటంతో మనీషాకు ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ లభించింది. మే 14న అరెస్టయిన మరో నిందితురాలు మనీషా వాఘ్మారే ద్వారా పలువురు విద్యార్థులతో వీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏప్రిల్‌లో వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించి, బోటనీ, జువాలజీ ప్రశ్నలను ముందుగానే వివరించి నోట్స్ రాయించారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో అవే ప్రశ్నలు రావడం గమనార్హం.

కింగ్‌పిన్ పీవీ కులకర్ణి పాత్ర..

ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న దయానంద్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని శుక్రవారం (మే 15న) పుణెలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా ఎన్‌టీఏ కాంట్రాక్ట్ నిపుణుడిగా పనిచేస్తున్న ఆయన కెమిస్ట్రీ పేపర్ రూపకల్పనలో పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని వాడుకున్న కులకర్ణి.. ఏప్రిల్ చివరి వారంలో ‘రాజ్ కోచింగ్ క్లాసెస్’ పేరుతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించి, మాక్ టెస్ట్ పేరిట అసలు ప్రశ్నలను విద్యార్థులకు అందించాడు.

కొనసాగుతున్న సీబీఐ దాడులు..

లాతూర్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహించిన మాక్ టెస్ట్‌లోని ఏకంగా 42 ప్రశ్నలు.. నీట్ మెయిన్ పరీక్షలో యథాతథంగా రావడంపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాతూర్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కింగ్‌పిన్ కులకర్ణి పాత్ర బయటపడటంతో, ఈ కేసు వివరాలను వారు సీబీఐకి అందించారు. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.. ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్లు, తదితర కీలక పత్రాలను సీజ్ చేసింది. కులకర్ణికి సహకరించిన మరో ఇద్దరు లెక్చరర్లు పరారీలో ఉండగా, వారి కోసం పుణె, లాతూర్‌లలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ట్రాన్సిట్ రిమాండ్ పై ఉన్న కులకర్ణిని సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Next Story