- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NDA: ఎన్డీయేలో సీట్ల పంచాయితీ.. హెచ్ఏఎం, ఎల్జేపీల అసంతృప్తి !
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో కీలక కూటములైన ఎన్డీఏ (NDA), ఇండియా (India) లు సీట్ల పంపకంపై దృష్టి సారించాయి. రెండు అలయెన్స్‌లు తమ తమ కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో సీట్ షేరింగ్ పై డిస్కస్ చేస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఏయే పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల వేళ ఎన్డీయే కూటమిలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీయేలోని హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీలు సీట్ల పంపకంపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. సీట్ షేరింగ్‌పై ఎన్డీయే నాయకులు శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే మిత్రపక్షమైన హెచ్ఏఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీ ప్రతిపాదించిన సీట్ల పంపకం ప్రతిపాదనను తిరస్కరించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆదివారం సీట్ల కేటాయింపుపై ప్రకటన చేస్తామని బీజేపీ తెలిపింది.
సీట్ షేరింగ్‌లో భాగంగా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న హెచ్ఏఎం పార్టీ 15 సీట్లు డిమాండ్ చేస్తుండగా, ఆ పార్టీకి 7 నుంచి 8 సీట్లు మాత్రమే ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చర్చలతో విసిగిపోయిన ఆ పార్టీ చీఫ్ జితన్ రామ్ మాంఝీ త్వరలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్డీఏలో చర్చలు విఫలమైతే, మాంఝీ స్వతంత్రంగా 15 నుంచి 20 సీట్లకు పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఎన్డీయేకు షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తాను ప్రతిపాదించిన సీట్లు కేటాయించకపోతే ఎన్డీయేలోనే ఉంటామని కానీ ఎన్నికల్లో పోటీ చేయబోమని మాంఝీ గతంలో ప్రకటించడం గమనార్హం. దీంతో ఎన్డీయే కూటమి సీట్ షేరింగ్‌పై ఆసక్తి నెలకొంది.
భారీగా సీట్లు డిమాండ్ చేస్తున్న ఎల్జేపీ
ఎన్డీయేలో మరో భాగస్వామ్య పార్టీ అయిన ఎల్జేపీ సైతం సీట్ల పంపకంపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. గతంలో 20 నుంచి 22 సీట్లకు ఓకే చెప్పిన ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం 25 సీట్లు కావాలని పట్టుబట్టారు. అయితే ఆయన పార్టీలోని మరికొందరు నేతలు ఏకంగా 40 సీట్లు అడుగుతున్నట్టు సమాచారం. దీంతో ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం జటిలంగా మారింది. నేడు మరోసారి ఎన్డీయే నేతలు సమావేశమై దీనిపై చర్చించనున్నారు.
విభేదాలేమీ లేవు: బీజేపీ చీఫ్ దీలిప్ జైస్వాల్
కూటమిలో విభేదాలున్నట్టు వెలువడుతున్న కథనాలను బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ కొట్టి పారేశారు. కేంద్ర నాయకత్వం మరోసారి సమావేశమై సీట్ల కేటాయింపుపై ప్రకటన చేస్తుందని తెలిపారు. కూటమిలో ఎలాంటి విభేదాలూ లేవని, అభ్యర్థుల జాబితాను అగ్ర నాయకత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అంతా సానుకూలంగా జరుగుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) చీఫ్ ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ.. సీట్ల పంపకాల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కాగా, బిహార్‌లోని ఎన్డీయే కూటమిలో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), బీజేపీ, హెచ్ఏఎం, ఎల్జేపీ (రామ్ విలాస్), ఆర్ఎల్ఎం పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి.






