ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం: ప్రియాంక గాంధీ

by Malleboina Mahesh |

'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం: ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: 'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహా ర్యాలీ (Congress party grand rally) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ (MP Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆమె ఆరోపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని పేర్కొంటూ, డాలర్ విలువ 90 రూపాయలకు చేరుకుందని ఆమె విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

పేపర్ లీక్‌ల కారణంగా యువత తమ ఉద్యోగావకాశాలను కోల్పోయి నష్టపోతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. అలాగే దేశీయ అంశాలపైనే కాకుండా ప్రభుత్వ విధానాలపై కూడా ఆమె నిప్పులు చెరిగారు. భారత విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. ఆర్థిక రంగంలో ఎగుమతులు తగ్గుతుండగా, దిగుమతులు మరింత ఖరీదు అవుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే దేశ ఆస్తులను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ చర్యలన్నీ దేశ ప్రజల సంపదను కొద్దిమందికి మాత్రమే దోచిపెడుతున్నారని ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేసింది.

Next Story