NCW: సోఫియాపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం- మహిళా కమిషన్

by Shamantha N |   (  Updated:2025-05-14 13:04:26  IST  )

ఆపరేషన్ సిందూర్ పై రక్షణదళాల తరఫున బ్రీఫింగ్ ఇచ్చిన కర్నల్‌ సోఫియా ఖురేషీ (Sophia Qureshi)పై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

NCW: సోఫియాపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం- మహిళా కమిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ పై రక్షణదళాల తరఫున బ్రీఫింగ్ ఇచ్చిన కర్నల్‌ సోఫియా ఖురేషీ (Sophia Qureshi)పై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ (NCW) ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు స్త్రీల పై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ విజయ రహాట్కర్‌ వ్యాఖ్యానించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఆ కామెంట్లు ఉన్నాయంది. అంతేకాకుండా, దేశ భద్రతలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కుమార్తెలను అవమానించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ‘‘కర్నల్‌ సోఫియా ఖురేషీ దేశం గర్వించదగ్గ కుమార్తె. దేశాన్ని ప్రేమించే భారతీయులందరికీ సోదరి. ఎంతో ధైర్యం, అంకిత భావంతో ఆమె దేశసేవ చేస్తున్నారు. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. దేశం ప్రగతిశీల అభివృద్ధి వైపు వెళ్లాలంటే స్త్రీలు ప్రతి రంగంలోనూ ముందువచ్చి నాయకత్వం చేపట్టాలి. అలాంటి మహిళలపై అగౌరవ వ్యాఖ్యలు చేయడం దేశాభివృద్ధిని అడ్డుకోవడమే ’’ అని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ విజయ రహాట్కర్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనలో ఎక్కడా మంత్రి పేరు నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.

మంత్రి ఏమన్నారంటే?

మరోవైపు, మధ్యపర్దేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా కర్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఉగ్రవాదకులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచి వేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోడీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అని ఇండోర్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్‌ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మంత్రి వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని.. ఆయన కామెంట్లు సిగ్గుచేటని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. మరోవైపు, తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి క్షమాపణలు చెప్పారు. కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని మీడియాతో అన్నారు. కర్నల్ సోనియాను కించపరిచే ఆలోచన లేదని.. తన మాటలు నొప్పిస్తే ఎన్నిసార్లైనా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని అన్నారు.

Next Story