NCERT తొందరపాటు నిర్ణయం: వివాదాస్పద ‘డ్యాన్సింగ్ గర్ల్’ మార్పుల విత్‌డ్రా

by Kema Shiva Kumar |

తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో సింధు లోయ నాగరికతకు చెందిన ‘డ్యాన్సింగ్ గర్ల్’ చారిత్రక శిల్పం రేఖాచిత్రాన్ని మార్చడంపై రేగిన వివాదానికి NCERT స్వస్తి పలికింది.

NCERT తొందరపాటు నిర్ణయం: వివాదాస్పద ‘డ్యాన్సింగ్ గర్ల్’ మార్పుల విత్‌డ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిదో తరగతి టెక్ట్స్ బుక్‌పై సింధు లోయ నాగరికతకు చెందిన ప్రసిద్ధ డ్యాన్సింగ్ గర్ల్ (Dancing Girl) బొమ్మను మార్చడంపై వెల్లువెత్తిన వివాదానికి ఎండ్‌కార్డ్ పడింది. విద్యావేత్తల ఆగ్రహం నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తన తప్పును దిద్దుకోవడానికి తక్షణమే రంగంలోకి దిగింది. మార్చిన చిత్రాన్ని తొలగించి, తిరిగి అసలైన చారిత్రక శిల్పం ఫోటోను చేర్చనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ మార్పులపై NCERT డైరెక్టర్ దినేష్ సక్లానీ మాట్లాడుతూ.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత విభాగాన్ని విచారణకు ఆదేశించామని అన్నారు. నిపుణులతో సంప్రదింపుల తర్వాత, పాఠ్యపుస్తకంలోని డ్యాన్సింగ్ గర్ల్ మార్చిన చిత్రాన్ని తీసేసి అసలైన ఫోటోను పెడతామని తెలిపారు. డిజిటల్ పుస్తకాల్లో ఈ మార్పును తక్షణమే అమలు చేస్తున్నామని, ప్రింట్ కాబోయే పుస్తకాలపై కూడా డ్యాన్సింగ్ గర్ల్ చిత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే..?

కొత్త విద్యా విధానం (NEP) ప్రకారం.. రూపొందించిన 9వ తరగతి ‘మధురిమ’ ఆర్ట్ టెక్స్ట్‌బుక్‌ మొదటి చాప్టర్‌లో 4,500 ఏళ్ల నాటి చారిత్రక కాంస్య శిల్పం రేఖాచిత్రాన్ని ముద్రించారు. అయితే, ఆ చిత్రంలో శిల్పంపై దుస్తులు ఉన్నట్లుగా చూపించడానికి పైభాగాన్ని డార్క్ షేడింగ్‌తో కప్పివేశారు. చారిత్రక సత్యాన్ని వక్రీకరిస్తూ చేసిన ఈ ‘సెన్సార్‌షిప్’పై విద్యావేత్తలు, ప్రముఖ చరిత్రకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా వివాదం మొదలైంది. తాజాగా NCERT తప్పును తెలుసుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది.

Next Story