ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలకు నదుల పేర్లు

by Malleboina Mahesh |   (  Updated:2026-06-25 07:05:14  IST  )

భారతీయ నదుల పేర్లతో ఎన్‌సీఈఆర్‌టీ సరికొత్త భాషా పాఠ్యపుస్తకాలు.. సమతుల్య ఆహార పాఠంలో శాకాహార, మాంసాహార చిత్రాలు!

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలకు నదుల పేర్లు
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తమ నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భారతదేశ సాంస్కృతిక, భౌగోళిక వారసత్వానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా వివిధ భాషల పాఠ్యపుస్తకాలకు భారతదేశంలోని ప్రముఖ జీవ నదుల పేర్లను పెట్టింది. హిందీ పాఠ్యపుస్తకానికి ‘గంగ’, ఇంగ్లీష్ పుస్తకానికి ‘కావేరి’, ఉర్దూ పాఠ్య పుస్తకానికి ‘జమున’ (యమున) అని నామకరణం చేయగా.. కర్ణాటకలో ప్రవహించే ముఖ్యమైన నదులలో ఒకటైన కృష్ణా నది గుర్తుగా కన్నడ పాఠ్యపుస్తకానికి ‘కృష్ణ’ అని పేరు పెట్టింది. అలాగే తెలుగు భాషకు గోదావరి అనే పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలావుండగా, ఈ కన్నడ పాఠ్యపుస్తకంలోని 'సమతుల్య ఆహారం' (Balanced Diet) అంశంపై వస్తున్న కొన్ని ఊహాగానాలపై అధికారులు స్పష్టతనిచ్చారు. ఈ పుస్తకంలోని 6వ అధ్యాయంలో (Chapter 6) సమతుల్య ఆహారం గురించి వివరించగా.. పేజీ నంబర్ 63లో ప్రత్యేకంగా ‘సమతుల్య ఆహారం’ అనే హెడ్డింగ్‌తో పూర్తి వివరాలను పొందుపరిచారు. ఆ పేజీలో ఇచ్చిన చిత్రంలో శాకాహార (Vegetarian), మాంసాహార (Non-Vegetarian) ఆహార పదార్థాలు రెండింటినీ కలిపి చూపించారని పేర్కొన్నారు. ఈ పాఠ్యపుస్తకంలో ఎక్కడా కూడా శాకాహారాన్ని మాత్రమే సమర్థిస్తూ మాట్లాడలేదని, అలాగే మాంసాహారాన్ని వ్యతిరేకించలేదని.. విద్యార్థులకు పోషకాహార విలువలను వివరించడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

Next Story