- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NCERT చిన్నారుల పుస్తకంలో సంచలనం.. ప్రధాని మోడీ అసంతృప్తి
ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతి గురించి ప్రస్తావించడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతి గురించి ప్రస్తావించడం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, సుప్రీంకోర్టు సదరు పాఠ్యపుస్తకంపై తక్షణమే 'కంప్లీట్ బ్లాంకెట్ బ్యాన్' (పూర్తిస్థాయి నిషేధం) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఏంటి మనం బోధిస్తున్నది? ప్రధాని మోడీ
మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 8వ తరగతి విద్యార్థులకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి పాఠాలు బోధించాల్సిన అవసరం ఏముందని ప్రధాని మోడీ అధికారులను ప్రశ్నించారు. ఇంతటి సున్నితమైన అంశాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చే ముందు తగిన పర్యవేక్షణ లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఈ కంటెంట్‌ను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఎవరు ఆమోదముద్ర వేశారని ఆయన నిలదీసినట్లు సమాచారం. చిన్న వయసులోనే వ్యవస్థలపై ప్రతికూల అభిప్రాయాలు కలిగించేలా ఉన్న ఈ పాఠ్యాంశంపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది.
న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది: సుప్రీంకోర్టు ఆవేదన
ఈ వివాదంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ‘వారు బుల్లెట్ కాల్పులు జరిపారు.. న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది’ అని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా, ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగంగానే ఇటువంటి పాఠ్యాంశాలను చేర్చారని ధర్మాసనం అభిప్రాయపడింది.
కోర్టు ఆదేశాలు ఇవే..
'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్' (వాల్యూమ్ II) పుస్తకం ముద్రణ, పంపిణీని తక్షణమే నిలిపివేయాలి. డిజిటల్ రూపంలో ఉన్న పుస్తక ప్రతులను కూడా వెబ్‌సైట్ల నుండి తొలగించాలి. ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, విద్యాశాఖ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ప్రభుత్వం క్షమాపణ.. పాఠ్యాంశం తొలగింపు
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విద్యాశాఖ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బేషరతు క్షమాపణలు కోరారు. ఇప్పటికే మార్కెట్లోకి వెళ్ళిన 32 పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపారు. ఈ పాఠ్యాంశాన్ని రూపొందించిన ఇద్దరు వ్యక్తులను తక్షణమే బాధ్యతల నుండి తప్పించామని, కొత్త బృందంతో అధ్యాయాన్ని తిరిగి రాయిస్తామని హామీ ఇచ్చారు.
వివాదానికి కారణమైన పాఠ్యాంశం..
ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన కొత్త పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని చేర్చారు. ఇందులో కేసుల జాప్యం, న్యాయమూర్తుల కొరతతో పాటు అవినీతి అంశాలను ప్రస్తావించారు. అయితే, న్యాయ వ్యవస్థ సాధించిన విజయాలను, ప్రజాస్వామ్య పరిరక్షణలో అది పోషిస్తున్న పాత్రను విస్మరించి, కేవలం ప్రతికూల అంశాలనే ప్రచారం చేయడంపై ప్రభుత్వం, న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా, ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది.






