- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US vs Bharath: రష్యా చమురుతో బ్రాహ్మణులకు లాభాలు.. రాజకీయ దుమారం రేపుతున్న ట్రంప్ సలహాదారు వ్యాఖ్యలు
భారత్ పై ట్రంప్ సలహాదారు నోరుపారేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టారిఫ్ లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) భారత్ విషయంలో తన ప్రేలాపనలు ఆపడం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్న కారణంతో భారత్ పై 50 శాతం టారిఫ్ భారం విధించారు. అయినా భారత్ వెనక్కి తగ్గకపోవడం అమెరికా ఇప్పుడు అక్కసుతో రగిలిపోతున్నది. తమ పంతం చెల్లుబాటు కాకపోవడంతో భారత సమాజంలో జాతి విభజనకు రెచ్చగొట్టే తరహాలో అమెరికా ముఖ్య నాయకుడు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ట్రంప్ కు వాణిజ్య సలహాదారుగా ఉన్న పీటర్ నవారో (Peter Navarro) భారత్ ను బెదిరించే విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల వ్యాఖ్యలతో ప్రేలాపనలు పేలిన ఆయన తాజాగా భారత్ పై నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుతో బ్రాహ్మణులకు (Brahmins) లాభం చేకురుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న వేళ యూఎస్ తెరమీదకు తీసుకువస్తున్న ఈ బ్రాహ్మణ వాదన రాజకీయంగా చర్చనీయాశం అవుతున్నది.
రష్యాకు భారత్ లాండ్రోమ్యాట్:
తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాకు భారత్ ఒక 'లాండ్రో మ్యాట్'(దుస్తులు ఉతికే యంత్రం)గా మారిందని అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంతో బ్రాహ్మణులు లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. భారత్ లోని ఉన్నత వర్గాలు రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసి దానిని రిఫైన్ చేసి అధిక ధరకు విదేశాలకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. భారత్ ఈ రకంగా రష్యా నుంచి చమురు కొని లాభాలకు అమ్ముకోవడం ద్వారా ఉక్రెయిన్ లో ప్రజలు చనిపోతున్నారని ఆరోపించారు. దీనిని మనం ఆపాలి. ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు అమెరికా పన్ను చెల్లింపుదారులు మరింత డబ్బు పంపాల్సి వస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ట్రంప్ కు భారత్ సహకరించకపోవడం వల్లే దేశ సమాజంలో విభజన ప్రయత్నాలకు అమెరికా తెరలేపిందని మండిపడుతున్నారు. బ్రాహ్మిన్స్ ను బద్నాం చేయడం ఆపాలని ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.
బిహార్ ఎన్నికల వేళ దుమారం:
త్వరలోనే బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఓబీసీ అంశాన్ని ఇండియా కూటమి ప్రధానాస్త్రంగా ఉపయోగిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం, రాబోయే జనగణనతో పాటే కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పీటర్ నవారో వ్యాఖ్యలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి. అయితే షాంఘై సహకార సదస్సు కోసం మోడీ చైనాలో పర్యటిస్తున్న వేళ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో భేటీకి ముందు అమెరికా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. భారత్ విషయంలో ఇప్పటికే సొంత దేశంలోని మేధావులతో విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ ప్రభుత్వం తమ స్వప్రయోజనం కోసం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. అసలే అందితే కాలు అందకపోతే జుట్టు అనే రకంగా అమెరికా వ్యవహరిస్తుందని ఈ విషయంలో ట్రంప్ మరింత ఆరితేరారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో నవారో కామెంట్స్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.






