ఇంకేం చేస్తే మారుతారు..? మూత్రవిసర్జన అడ్డుకునేందుకు పెట్టిన అద్దాల ముందే వ్యక్తి నిర్వాకం

by Ramesh Naini |

ఒక వ్యక్తి ఏమాత్రం సిగ్గులేకుండా ఆ అద్దాల ముందే మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.

ఇంకేం చేస్తే మారుతారు..? మూత్రవిసర్జన అడ్డుకునేందుకు పెట్టిన అద్దాల ముందే వ్యక్తి నిర్వాకం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జనను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొందరి తీరు మారడం లేదు. గోడల మీద హెచ్చరికలు రాయడం, దేవుళ్ల చిత్రపటాలు పెట్టడం వంటి ఎన్నో పద్ధతులు ఉపయోగించినా ఫలితం లేకపోవడంతో.. మైసూరు నగర పాలక సంస్థ (ఎంసీసీ) ఓ వినూత్న ఆలోచనతో ఏకంగా అద్దాలను ఏర్పాటు చేసింది. కానీ, ఒక వ్యక్తి ఏమాత్రం సిగ్గులేకుండా ఆ అద్దాల ముందే మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. మైసూరు సబర్బన్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న 80 మీటర్ల పొడవైన ఖాళీ ప్రహరీ గోడ వద్ద పౌరుల ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు రూ. 9.5 లక్షల ఖర్చుతో స్టెయిన్‌లెస్ స్టీల్ 'రిఫ్లెక్టివ్ ప్యానెల్స్' (అద్దాలు) ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ మూత్ర విసర్జన చేయడానికి వస్తే, ఆ అద్దాల్లో వారి ప్రతిబింబం దారిన పోయే వారందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. నలుగురూ చూస్తారనే భయం, సిగ్గుతోనైనా ఈ పని చేయకుండా ఉంటారన్నది అధికారుల ఉద్దేశం. రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా వీధిదీపాలతో పాటే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే ఎల్ఈడీ లైట్లను సైతం ఈ అద్దాల చుట్టూ అమర్చారు.

వైరల్ అవుతున్న వీడియో..

అంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఎల్ఈడీ అద్దాల ముందే ఒక వ్యక్తి నిలుచొని మూత్రవిసర్జన చేశాడు. ఇది గమనించిన ఓ స్థానికుడు నేరుగా అక్కడికి వెళ్లి అతడిని నిలదీసి, భుజంపై కొట్టినట్లు అక్కడే రికార్డైన ఓ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితమే ప్రారంభించిన ఈ వినూత్న ప్రయోగానికి ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. కానీ, ఇంతలోనే ఒక ఆకతాయి ఇలాంటి చర్యకు పాల్పడటం పట్ల స్థానికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేం చేస్తే మారుతారు? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story