- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలరోజుల్లో లొంగిపో లేదంటే ఎన్ కౌంటరే.. మిసిర్ బేస్రాకు డీజీ అల్టిమేటం
సారండా అడవుల్లో మావోయిస్టులపై భద్రతాదళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. టాప్ మావోయిస్ట్ నేత మిసిర్ బెస్రాకు నెల రోజుల డెడ్‌లైన్

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ సరిహద్దుల్లోని సారండా అడవుల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన మావోయిజాన్ని అంతం చేసేందుకు భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (SDG) దీపక్ కుమార్ బాలిబా క్యాంప్‌ను సందర్శించి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలు పంపారు. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఈస్టర్న్ రీజనల్ బ్యూరో(ఈఆర్బీ) ఇన్చార్జి, జార్ఖండ్‌కు చెందిన అగ్రనేత మిసిర్ బెస్రా అలియాస్ సాగర్‍కు నెలరోజుల సమయం ఇస్తున్నామని ఈలోపు అతను లొంగిపోవాలని లేదంటే ఎన్‍కౌంటర్ చేస్తామని హెచ్చరించారు. బెస్రాతో పాటు అతని టీమ్‍కు లొంగిపోవడమే వారి ముందున్న ఏకైక మార్గం అన్నారు.
బెస్రా లక్ష్యంగా ఆపరేషన్:
వాలిబా గ్రామంలోని 193వ బెటాలియన్ క్యాంప్‌ను సందర్శించిన డీజీ ఈ సందర్భంగా జవాన్లతో ముచ్చటించి వారిలో ధైర్యాన్ని నింపారు. దేశంలో అత్యంత నక్సల్ ప్రభావిత జిల్లాగా మిగిలింది పశ్చిమ సింగ్‌భూమ్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సారండాలో జరుగుతున్న ఆపరేషన్ ప్రధానంగా మిసిర్ బెస్రా అతని టీమ్ లక్ష్యంగా చేసుకుని సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెల రోజుల్లో ఆపరేషన్‌ను నిర్ణయాత్మక దశకు చేరుస్తామని ఆయన వెల్లడించారు. అయితే భద్రతా బలగాలు మొదటిసారిగా ఒక టాప్ మావోయిస్టు నేతను లక్ష్యంగా చేసుకుని 'డెడ్‌లైన్' విధించడం గమనార్హం. ఇది సాధారణ కూంబింగ్ నుంచి టార్గెటెడ్ మోడ్‍లోకి ఆపరేషన్ మారినట్లు సంకేతాలిస్తోంది. ప్రస్తుతం సారండా అడవుల్లో 45 నుంచి 50 మంది నక్సల్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వదంతుల ఖండన:
మిసిర్ బెస్రా కుమారుడు సారండాకు వచ్చారన్న వార్తలను డీజీ దీపక్ కుమార్ కొట్టిపారేశారు. అటువంటి సమాచారం ఏదీ లేదని స్పష్టం చేశారు. సారండాలో నక్సల్స్ గెరిల్లా పోరాటం సాగుతున్న వేళ, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా కోబ్రా 205 బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. డీజీ దీపక్ కుమార్ సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో, వెంటనే అతన్ని హెలికాప్టర్ ద్వారా చికిత్స కోసం తరలించారు. మొత్తం 7 గురు అస్వస్థతకు గురైన జవాన్లను హెలికాప్టర్ ద్వారా తరలించారు.






