- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Elections: ఢిల్లీలో ముస్లిం ఓటర్లు ఎటు వైపు?
ఢిల్లీ జనాభాలో 12.9 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వీరి ఓట్లను పొందడానికి వీలైనంతగా కష్టపడుతున్నాయి.

- మైనార్టీ ఓటర్లను టార్గెట్ చేసిన ఆప్, కాంగ్రెస్
- త్రిముఖ పోటీలో లాభపడతామంటున్న బీజేపీ
- క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది?
దిశ, నేషనల్ బ్యూరో:
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి మరో మూడు వారాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వరుసగా నాలుగో సారి విజయం సాధిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతుండగా.. ఈ సారి తప్పకుండా విజయం సాధిస్తామని బీజేపీ అంటోంది. కాగా, 12 ఏళ్ల కిందట కోల్పోయిన అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఢిల్లీలో మరోసారి ముస్లిం ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఢిల్లీలో 21.6 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే..ఆ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని హిందూ కాలేజీలో పొలిటికల్ సైన్ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ అనలిస్ట్ చంద్రచూర్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని అందరికీ తెలిసిన విషయమే. గత దశాబ్దం పైగా ముస్లిం ఓట్లు ఆప్‌కే పడుతున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుండటంతో ముస్లిం ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారిందని ఆయన చెప్పారు.
ఆరు నియోజకవర్గాల్లో ముస్లింల డామినేషన్..
మహిళలు, ఉచిత పథకాల పైనే ఆప్ నమ్మకం పెట్టుకుంది. ఇక ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి ముస్లిం ఓటర్లు ఆప్ వైపు నిలబడ్డారు. అయితే ఈ సారి కొంత మంది కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలను కూడా కొట్టి పారేయలేము. ఢిల్లీ జనాభాలో 12.9 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వీరి ఓట్లను పొందడానికి వీలైనంతగా కష్టపడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉండగా.. అందులో 6 నియోజకవర్గాల్లో 50 శాతం కంటే పైగా ముస్లిం జనాభా ఉంది. సీలంపూర్‌లో 50 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇక ఆ తర్వాత మాతియా మహల్ (48 శాతం), ఓక్లా (43 శాతం), ముస్తాఫాబాద్ (36 శాతం), బాలిమారన్ (38 శాతం), బాబర్‌పూర్ (35 శాతం) నియోజకవర్గాల్లో కూడా ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరు నియోజకవర్గాలను ఆప్ క్లీన్ స్వీప్ చేసింది.
ఈ ఆరు నియోజకవర్గాలే కాకుండా సీమాపురి (25 శాతం), గాంధీ నగర్ (22 శాతం), చాందినిచౌక్ (20 శాతం), సదర్ బజార్ (20 శాతం), వికాస్‌పురి (20 శాతం), కర్వాల్‌నగర్ (20 శాతం)లో కూడా ముస్లిం జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. ఈ నియోజకవర్గాలన్నింటినీ గెలవడానికి ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ కూడా ఢిల్లీ ఎన్నికల బరిలో నిలబడుతోంది. ఇది తప్పకుండా ఆప్, కాంగ్రెస్ ఓట్లను దెబ్బ తీసే అవకాశాలు కనపడుతున్నాయి.
స్థానికులు అభిప్రాయమేంటి?
కాంగ్రెస్ పార్టీలో మంచి మనుషులు ఉన్నారు. అదే సమయంలో అర్వింద్ కేజ్రివాల్ ఢిల్లీలోమంచి పనులు చేశారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా మాకు సంతోషమే అని న్యూ సీలంపూర్ మార్కెట్‌కు చెందిన సైరా భాను అభిప్రాయపడ్డారు. మంచి నీటి పైపుల నుంచి అపరిశుభ్రమైన నీళ్లు వస్తున్నాయి. అలాగే చెత్తను సకాలంలో తొలగించడం లేదు. డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయని ఆమె అన్నారు. ఇప్పటి వరకైతే తాను ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని సైరా భాను చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను మతం పేరుతో విభజించదు. గతంలో తాను రూ.2,000 నుంచి రూ.2,200 వరకు ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించేవాడిని. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా కట్టడం లేదు. గత కొన్నేళ్లుగా ఈ డబ్బంతా తనకు మిగిలినట్లే అని డ్రైవర్‌గా పని చేస్తున్న అబ్దుల్ ఫాజిల్ అన్నాడు. ఈ సారి కూడా తాను ఆప్‌కే ఓటేస్తానని చెప్పాడు. కాగా, మంచి నీటి కూళాయిల్లో నుంచి నల్లటి నీళ్లు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండట్లేదని మహ్మద్ నయాబ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
2020లో అల్లర్లకు కేంద్రంగా నిలిచిన గోకుల్‌పురి టైర్ మార్కెట్‌లో అనేక మంది వ్యాపారులు ఆప్‌కే అనుకూలంగా ఉన్నారు. అల్లర్ల కారణంగా దుకాణాలు కోల్పోయిన వాళ్లు, వ్యాపారాలు నష్టపోయిన వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 224 దుకాణాల్లో 124 దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని.. కోవిడ్ కాలంలో అన్ని షాపులు దాదాపు 8 నెలల పాటు మూసే ఉంచామని మార్కెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ నజర్ అంటున్నారు. ప్రజలకు ఆప్ మంచి చేసింది. అయితే కాంగ్రెస్ కూడా ఈ సారి కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని నజర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉందని కూడా పేర్కొన్నాడు.
ఆగ్నేయ ఢిల్లీలో ఇదీ పరిస్థితి..
సౌత్ఈస్ట్ (ఆగ్నేయ) ఢిల్లీ గతంలో సీఏఏ-ఎన్‌ఆర్సీ ఆందోళనకు కేంద్రంగా ఉంది. దేశం మొత్తాన్ని ఆకర్షించిన షాహీన్‌బాగ్ ఆగ్నేయ ఢిల్లీలోనే ఉంది. ఇక్కడి ప్రజలు పాడైపోయిన రోడ్ల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఆప్‌కు మద్దతుగా నిలవడానికి తమదైన కారణాలు చెబుతున్నారు. ఆప్ ప్రభుత్వం ఇక్కడ పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఉచితంగా కరెంటు, నీళ్లు, బస్సు ప్రయాణాన్ని అందించడం వల్ల తమ కుటుంబం చాలా లబ్ది పొందిందని మహ్మద్ సలాహుద్దీన్ చెబుతున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఆప్‌కు కంచుకోట లాంటిది. స్థానిక ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ పట్ల ప్రజలకు సదభిప్రాయం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఓట్లు చీలకుండా చూసుకుంటే ఆప్ తప్పకుండా గెలుస్తుందని ఆయన చెప్పారు.
ఉత్తర ఢిల్లీలో..
నార్త్ ఢిల్లీ, మాతియా మహల్, బాలిమారన్, చాందినీ చౌక్‌లు ఉత్తర ఢిల్లీలో కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు ముస్లిం కమ్యూనిటీకి కూడా ప్రధానమైనవి. ఇక్కడ పారిశుథ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత కూడా ఇక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు. మరోవైపు చాందినీ చౌక్ ప్రాంతంలో పార్కింగ్ సమస్య ఉంది. ఇక్కడి ముస్లింలు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఈ ప్రాంతం కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేది. కానీ గత మూడు సార్లు ఆప్ ఇక్కడి నుంచి గెలిచింది. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.






