Supreme Court: ముంబై రైలు పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై సుప్రీంకోర్టులో సవాలు

by S Gopi |

ఈ అంశానికి సంబంధించి అత్యవసర పరిస్థితిని పేర్కొంటూ మహారాష్ట్ర ఏటీఎస్ తరపు సొలిసిటర్ జనరల్ కోరడంతో లిస్టింగ్ చేశారు.

Supreme Court: ముంబై రైలు పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంపై సుప్రీంకోర్టులో సవాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: 2006లో జరిగిన ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూలై 24న ఈ కేసును విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. భారత సీజేఐ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కె వినోద్ చంద్ర, ఎన్ వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం వచ్చే గురువారం విచారణకు అంగీకరించింది. ఈ అంశానికి సంబంధించి అత్యవసర పరిస్థితిని పేర్కొంటూ మహారాష్ట్ర ఏటీఎస్ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యవసరంగా విచారణకు కోరడంతో లిస్టింగ్ చేశారు. కాగా, 2006, జూలై 11న ముంబైలోని పశ్చిమ రైల్వే స్థానిక మార్గంలో జరిగిన ఏడు బాంబు దాడులకు కుట్ర పన్ని అమలు చేసినందుకు ఐదుగురు నిందితులకు మరణశిక్ష, మరో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన 2009 తీర్పును సోమవారం బాంబే హైకోర్టు రద్దు చేసింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయినందునే నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఈ కేసును దర్యాప్తు చేసిన మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళానికి హైకోర్టు తీర్పు గట్టి దెబ్బగా మారింది. నిందితులు నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)తో సంబంధం కలిగి ఉన్నారని, పేలుళ్లు జరపడానికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ) పాకిస్తాన్ కార్యకర్తలతో కుట్ర పన్నారని ఏటీఎస్ వాదిస్తోంది.

Next Story