భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం.. ముకేశ్ అంబానీకి తప్పిన ప్రమాదం

by Naga Rani Yarlagadda |

భారీ వర్షాలు ముంబైను వణికించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం.. ముకేశ్ అంబానీకి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు ముంబైను వణికించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంబైకి ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతుండగా.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. ప్రధానంగా నగరంలో గడిచిన 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. లోతట్టు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. విక్రోలిలో అత్యధికంగా 31.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మరోవైపు ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో మెట్రో, ప్రజా రవాణా సేవలు యథాతథంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించగా.. మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. థానే, పాల్ఘర్, నవీ ముంబయి, పుణె ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడగా.. మరికొన్ని చోట్ల రోడ్లు నీట మునిగిపోయాయి. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు 1916 హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని బీఎంసీ అధికారులు సూచించారు.

మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త, బిలీయనీర్ అయిన ముకేశ్ అంబానీ కాన్వాయ్ కు పెనుప్రమాదం తప్పింది. బంద్రాలో ఓ భారీ వృక్షం ఆయన కాన్వాయ్ ముందే కూలిపోయింది. దీంతో కొద్దిసమయంపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు కూలిన చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Next Story