రెండో అత్యంత కాలుష్య నగరంగా 'ముంబై'

by Dishafeatures2 |
రెండో అత్యంత కాలుష్య నగరంగా ముంబై
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 తేదీల మధ్య కాలానికి నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను 'స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్' ఐక్యూ ఎయిర్ తయారుచేసింది. ఇందుకోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సమాచారం సేకరించినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది. జనవరి 29న ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై.. ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా మారింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడినా.. ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది.

ఫిబ్రవరి 13న మూడో స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా 'పూర్','వెరీ పూర్' కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, రోడ్లపై ఎగిసిపడే దుమ్ముధూళి వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్‌తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. కాగా, ఈ రిపోర్టులో అత్యంత కాలుష్య నగరంగా మొదటిస్థానంలో పాకిస్థాన్ దేశంలోని లాహోర్ సిటీ నిలవగా, రెండో స్థానంలో ముంబై ఉంది.

Next Story

Most Viewed