- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Muda scam: ముడా కేసులో సిద్ధరామయ్య భార్యకు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Muda) భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) భార్య పార్వతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. బెంగళూరులోని శాంతినగర్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002లోని నిబంధనల ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్నామని ఈడీ తెలిపింది. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య సైతం ధ్రువీకరించారు. ఈడీ నోటీసులు పంపిన విషయం నిజమేనని స్పష్టం చేశారు.
అలాగే కర్ణాటక మంత్రి బైరతి సురేష్‌కు సైతం ఈడీ నోటీసులు పంపింది. అయితే ఆయన ఎప్పుడు విచారణకు రావాలనేది స్పష్టంగా తెలియరాలేదు. కాగా, ముడా స్థలాల కేటాయింపులో భాగంగా సిద్ధరామయ్య భార్యకు మైసూర్‌లోని ఓ ఏరియాలో స్థలాలు కేటాయించారని, ఆమె భూమి కంటే వాటి విలువ ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య కీలక నిందితుడిగా ఉన్న ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. మరోవైపు స్థలాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన లోకాయుక్త తన నివేదికను కర్ణాటక హైకోర్టుకు అందజేసినట్టు తెలుస్తోంది. అయితే లోకాయుక్త పోలీసులు సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని తేల్చే అవకాశం ఉందని సమాచారం.






