Supreme Court: మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టలో స్వల్ప ఊరట

by Shamantha N |

మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయన్ని అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది.

Supreme Court: మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టలో స్వల్ప ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయన్ని అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. అంతేకాకుండా, అతడిపై విచారణను నిలిపివేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మీడియాకు బ్రీఫింగ్‌ ఇచ్చిన కర్నల్‌ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయనపై కేసు నమోదైంది. దీంతో, విజయ్ షా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆయన్ని అరెస్టు చేయకుండా అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో బుధవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కున్వర్ విజయ్ షా అరెస్టును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది.

సిట్ ఏర్పాటు

మరో వైపు ముగ్గురు ఐపీఎల్‌ అధికారులను కూడిన సిట్‌ ఏర్పాటు చేసినట్లు డీఐజీ పోలీసులకు సమర్పించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను ధర్మాసనం పరిశీలించింది. దర్యాప్తు మే 21న ప్రారంభమైందని.. మరిన్ని పత్రాలను సేకరించాలని ఉందని సిట్‌ నివేదికలో పేర్కొంది. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని.. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని రిపోర్టులో తెలిపారు. విజయ్ షా అరెస్టుతో సహా మే 19న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించినట్లు పేర్కొంది. కేసులో తదుపరి విచారణను జులై రెండోవారంలో నిర్వహించాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో ఎలాంటి జోక్యాన్ని అనుమతించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించింది.

Next Story