- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షణ క్షణం ఉత్కంఠంగా తమిళ రాజకీయాలు.. గవర్నర్‌పై కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యధిక సీట్లు సాధించిన విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కపిల్ సిబల్ సోషల్ మీడియా వేదికగా కీలక పోస్టు పెట్టారు. కేంద్ర ప్రభుత్వంపై, గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. "ప్రస్తుత రోజుల్లో గవర్నర్లు స్వతంత్రంగా వ్యవహరించడం లేదు, వారు కేవలం బీజేపీ ఏజెంట్లుగా మారిపోయారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన వారు, రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.
సిబల్ లేవనెత్తిన ప్రధానాంశాలు..
సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన పక్షాన్ని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఆ తర్వాతే సభలో బలాన్ని నిరూపించుకోవడానికి సమయం ఇవ్వాలి. కానీ, తమిళనాడులో విజయ్ పార్టీని ముందే మెజారిటీ చూపాలని కోరడం వెనుక కుట్ర ఉందని సిబల్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో గవర్నర్లు అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారిందని, ఇది సమాఖ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఒక పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టినప్పుడు, ఆ తీర్పును గౌరవించకుండా సాంకేతిక కారణాలతో కాలయాపన చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని సిబల్ పేర్కొన్నారు.
తమిళనాడులో ఉత్కంఠ..
విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నప్పటికీ, గవర్నర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని ఇప్పుడే సమర్పించాలని గవర్నర్ కోరడంపై అటు తమిళనాడులో, ఇటు ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాది ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని విమర్శలు చేయడంతో, ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.






