అత్తింటి వేధింపులు! ముగ్గురు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్యాయత్నం

by Ramesh Naini |   (  Updated:2026-02-02 12:19:01  IST  )

అత్తింటి వేధింపులు తాళలేక ఓ తల్లి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది.

అత్తింటి వేధింపులు! ముగ్గురు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్యాయత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అత్తింటి వేధింపులు తాళలేక ఓ తల్లి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. కన్నబిడ్డలనే కాలయముడిలా మారి ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బాగల్‌కోట్ జిల్లాకు చెందిన రూపా హనుమంత్ గౌడర్ (27), హనుమంత్ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు సమృద్ధి (5), ప్రీతమ్ (4), సుక్షిత్ (2) ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భర్త, అత్త తనను వేధిస్తున్నారని రూప ఆవేదన చెందేది. శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో..!

ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో భర్త హనుమంత్ తన తల్లిని గుడిలో దింపి, పొలం పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రూప ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ముందుగా తన ముగ్గురు పిల్లలను ఉరేసి చంపేసింది. అనంతరం ఆమె డీజిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన హనుమంత్, తలుపులు లోపలి వైపు గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో, స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల ముగ్గురు పిల్లలు విగత జీవులుగా పడి ఉండగా, రూప అపస్మారక స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు వెంటనే రూపను బాగల్‌కోట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై బాగల్‌కోట్ ఎస్పీ సిద్ధార్థ్ గోయల్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక విచారణలో భర్త, అత్త వేధింపుల వల్లే రూప ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కోలుకున్న తర్వాత స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తాం’ అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్ పదవి కోసం కన్న బిడ్డను హత్య చేసిన కసాయి తండ్రి

Next Story