- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIT Madras: మద్రాస్ ఐఐటీ నుంచి ఒకేసారి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తల్లి కొడుకు
16 ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన జిగీషా, కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే 2022లో కుమారుడి ప్రోత్సాహంతో మళ్లీ చదువు ప్రారంభించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన 45 ఏళ్ల జిగీషా టేలర్, ఆమె 21 ఏళ్ల కుమారుడు ఆదిత్య కపాడియా ఒకే వేదికపై డిగ్రీలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇద్దరూ ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసినప్పటికీ, ఒకేసారి పట్టభద్రులు అవుతామని వారు కూడా ఊహించలేదు. గుజరాత్‌లోని భరూచ్‌లో 16 ఏళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన జిగీషా, కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే 2022లో కుమారుడి ప్రోత్సాహంతో మళ్లీ చదువు ప్రారంభించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి చదువుకోవడం, ఇంటి పనుల మధ్యే చదివేందుకు కూడా సమయం కేటాయించడం, ప్రతి సెమిస్టర్‌లో ఒకటి లేదా రెండు సబ్జెక్టులు మాత్రమే తీసుకుంటూ క్రమంగా కోర్సు పూర్తి చేయడం ఆమె విజయానికి కారణమైంది. 'ఈ వయసులో చదువెందుకు?' అని చాలామంది ప్రశ్నించినా, 'కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నాను' అనే ఆమె సమాధానమే ఈ ప్రయాణానికి నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు, కోవిడ్ కాలంలో 18 ఏళ్ల వయసులోనే ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో చేరిన ఆదిత్య, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తితో తన చదువును కొనసాగించాడు. తర్వాత డిప్లొమా కోర్సును విడిచి పూర్తిగా ఐఐటీ మద్రాస్ బీఎస్ డిగ్రీపై దృష్టి పెట్టాడు. తల్లికి సబ్జెక్టులు, వైవా, పరీక్షల విధానం వివరించడమే కాకుండా, ఇద్దరూ గ్రేడ్‌ల కోసం సరదాగా పోటీ పడేవారు. 2024లో బీఎస్ పూర్తి చేసిన ఆదిత్య ప్రస్తుతం డేటా సైన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. జిగీషా మాత్రం చిన్న కుమారుడి చదువు పూర్తయ్యాక మళ్లీ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని భావిస్తున్నారు. స్నాతకోత్సవానికి ముందు వారి కథ తెలుసుకున్న తోటి విద్యార్థుల సహకారంతో ఇద్దరికీ ఒకే వేదికపై డిగ్రీలు అందుకునే అవకాశం లభించింది. ఈ అరుదైన సందర్భం ఆ కుటుంబానికే కాదు, చదువుకు వయసు అడ్డంకి కాదని నమ్మే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.






