- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ శుక్రు లొంగుబాటు
మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ శుక్రు మరో నలుగురితో కలిసి ఒడిశాలోని కొందమాల్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ శుక్రు ఒడిశాలోని మంగళవారం కొందమాల్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన ఏకే- 47 రైఫిల్ తో లొంగిపోయినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఆయనతో పాటు మరో నలుగురు సభ్యులు కూడా కంధమాల్ పోలీసుల సమక్షంలో ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోయారు. గత కొంతకాలంగా కంధమాల్ జిల్లా కేంద్రంగా సాగుతున్న అనేక తిరుగుబాటు చర్యల్లో శుక్రు కీలక పాత్ర పోషించారు. కేకేబీఎన్ (కొందమాల్ - కలహండి- బౌద్- నయాగఢ్) డివిజన్ కు చెందిన శుక్రు.. ఎయిత్ కంపెనీ పేరిట కొత్తగా దళాన్ని ఏర్పాటు చేసిన శుక్రు.. కొందమాల్ జిల్లాలో మావోయిస్ట్ కార్యకలాపాలను చురుగ్గా సాగించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఏడీజీ సంజీబ్ పాండా వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రుపై రూ.55 లక్షల రివార్డు ఉంది. శుక్రు లొంగుబాటుకు జిల్లాలో మావోయిస్టు అగ్రనేతలు, సభ్యులు వరుసగా లొంగిపోతుండటంతో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) బలహీనపడటం ఒక కారణమైతే, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం పట్ల ఆకర్షితులవ్వడం మరో కారణంగా తెలుస్తోంది.
ఈ పరిణామంపై డీజీపీ వై.బి. ఖురానియా స్పందిస్తూ.. భద్రతా దళాల నిరంతర కృషి, ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్ల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం ఒడిశాలో కేవలం 9-10 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని తెలిపారు. మార్చి 31 నాటికి ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. లొంగిపోయిన శుక్రుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. మరోవైపు.. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో కూడా వెస్ట్ బస్తర్ డివిజన్ ఇన్‌చార్జ్ పాపారావు లొంగిపోవడంతో మావోయిస్టు నెట్‌వర్క్ పూర్తిగా కుప్పకూలినట్లయింది.
సొంత కామ్రేడ్‌ను హతమార్చి?
గత నెలలో లొంగుబాటు అంశంపై తన డిప్యూటీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కమాండర్ అన్వేష్‌తో శుక్రుకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రు తన అనుచరులతో కలిసి అన్వేష్‌ను గొడ్డలితో నరికి చంపి, మృతదేహాన్ని పకారీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ ఘటన జరిగిన నెల రోజుల్లోనే శుక్రు స్వయంగా లొంగిపోవడం గమనార్హం.
మల్కన్‌గిరి జిల్లాకు చెందిన కోయ తెగకు చెందిన శుక్రు.. 1997లో మావోయిస్టు దళంలో చేరారు. 1997-2007: దండకారణ్య ప్రాంతంలో శిక్షణ తీసుకుని, కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 2007లో ఒడిశాకు తిరిగి వచ్చి ఘుమ్సర్ డివిజన్‌లో అండర్‌గ్రౌండ్ కేడర్‌గా పనిచేశారు. గంజాం, కంధమాల్, గజపతి, రాయగడ జిల్లాల డివిజనల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణకు అత్యంత నమ్మకస్థుడైన లెఫ్టినెంట్‌గా శుక్రుకు పేరుంది. గతేడాది సెప్టెంబర్‌లో బాలకృష్ణ ఎన్‌కౌంటర్‌లో మరణించినప్పుడు, శుక్రు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం.






