- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Monsoons: దేశంలోకి రుతుపవనాల ఎంట్రీ..16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
దేశ వ్యవసాయానికి కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యవసాయానికి కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. షెడ్యూల్ కంటే 8 రోజుల ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళలోనే గాక కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, మిజోరంలోని కొన్ని ప్రాంతాలకూ చేరుకున్నాయి. ఇది వేగంగా దూసుకొస్తున్నాయని రాబోయే రెండుు మూడు రోజుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా రాష్ట్రాలకు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
16 ఏళ్లలో ఇదే తొలిసారి
ఈ ఏడాది సాధారణం కంటే 8 రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ విధంగా రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇవ్వడం 16 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు 2009లో రుతుపవనాలు 9 రోజుల ముందే ఎంట్రీ ఇచ్చాయి. ఆ ఏడాది మే 23నే రుతుపవనాలు రాగా ఆ తర్వాత ఇదే తొలిసారి. ఎల్‌నినో ప్రభావం, హిందూ మహాసముద్రం ఉష్ణోగ్రతలో మార్పులు వంటి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈసారి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు 2018లో మే 29న, 2019లో జూన్ 8న, 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29న, 2023లో జూన్ 8న, గతేడాది మే 30న రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, దేశ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు వెన్నెముక. ఇది దేశ జనాభాలో 42.3 శాతం మందికి జీవనోపాధిని అందిస్తుంది. అంతేగాక జీడీపీ మెరుగుదలకు సైతం తోడ్పడుతుంది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.






