Monika Kapoor: 26 ఏళ్లుగా భారత్ కు సవాల్.. ఎట్టకేలకు మోనికా కపూర్ అరెస్ట్

by Prasad Jukanti |

భారత్ కు రాకుండా 26 ఏళ్లుగా తప్పించుకుంటున్న మోనికా కపూర్ ను సీబీఐ కస్టడీకి తీసుకుంది.

Monika Kapoor: 26 ఏళ్లుగా భారత్ కు సవాల్.. ఎట్టకేలకు మోనికా కపూర్ అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక నేరాల కేసులో పరారీలో ఉన్న నేరస్తురాలు మోనికా కపూర్ ను (Monika Kapoor) ఎట్టకేలకు సీబీఐ (CBI) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అమెరికాలో సీబీఐ కస్టడీకి అప్పగించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. భారత్-అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూయార్క్ లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్ కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆమెను ఎయిర్ లైన్స్ విమానంలో బుధవారం రాత్రికి అమెరికా నుంచి భారత్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మోనికా కపూర్ 1998లో తన సోదరులు రాజన్, రాజీవ్ తో కలిసి ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో నకిలీ పత్రాలను తయారు చేసి మోసానికి పాల్పడ్డారు. నకిలీ సర్టిఫికేట్లతో ఆరు లైసెన్స్ లు పొంది వాటిని వ్యాపారం చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ఉపయోగించారు అనంతరం ఆమె భారత్ ను విడీ అమెరికా పారిపోయింది. 1999లో ఆమె చేసిన మోసానికి గాను భారత ప్రభుత్వానికి దాదాపు రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో ఆమెపై 2004లో కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని భారత ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాటిని ఆమె బేఖాతరు చేస్తూ వస్తోంది. దీంతో మోనికా కపూర్ ను అప్పగించాలని భారత ప్రభుత్వం 2010లో అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అనంతరం ఇంటర్ పోల్ అధికారులు ఆమెపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు భారత్ కు అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే తనను భారత్ కు పంపిస్తే అక్కడ చిత్రహింసలకు గురి చేస్తారంటూ మోనికా న్యూయార్క్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన అధికారులు ఎట్టకేలకు సీబీఐ అధికారులకు అప్పగించారు. దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ భారత్ కు తరలించి విచారణ చేపట్టనున్నారు.

Next Story