నటుడు మోహన్‌లాల్‌కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ లైసెన్స్ రద్దు

by Naga Rani Yarlagadda |

కొచ్చిలోని తేవరలో గల మోహన్ లాల్ ఇంటిలో 2011 డిసెంబర్ 21న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

నటుడు మోహన్‌లాల్‌కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ లైసెన్స్ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్ స్టార్, నటుడు మోహన్ లాల్ కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సేకరించిన ఏనుగు దంతాలను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని కేరళ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అలాగే మోహన్ లాల్ కు జారీ చేసిన లైసెన్సును సైతం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన నిబంధనలను అనుసరించి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై 2015లో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో లోపాలున్నాయని, దానిని అధికారిక గెజిట్ ప్రచురించనందున చెల్లదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీనిపై వాదించిన మోహన్ లాల్ తరపు న్యాయవాది.. ఇది కేవలం టెక్నాలజీ సమస్య మాత్రమేనన్నారు.

ఇదీ జరిగింది..

కొచ్చిలోని తేవరలో గల మోహన్ లాల్ ఇంటిలో 2011 డిసెంబర్ 21న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంటిలో రెండు జతల ఏనుగు దంతాలు, 13 ఐవరీ వస్తువులు స్వాధీనమయ్యాయి. చట్టవిరుద్ధంగా వాటిని కలిగి ఉన్నారంటూ.. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘనగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కేసు నమోదు చేసింది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఓనర్‌షిప్ సర్టిఫికెట్ జారీ చేసి కేసును ఉపసంహరించుకోవాలని ప్రయత్నించింది. అయితే పెరుంబవూర్ మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని తిరస్కరించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మోహన్‌లాల్ హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, మోహన్‌లాల్‌కు ఇచ్చిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధమని ప్రకటించి రద్దు చేసింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రక్రియలో లోపాలున్నాయని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.

Next Story