PM Modi: మస్క్‌ పిల్లలకు మోదీ బహుమతులు.. ఏం ఇచ్చారంటే?

by Yella Dhawani Reddy |

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

PM Modi: మస్క్‌ పిల్లలకు మోదీ బహుమతులు.. ఏం ఇచ్చారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం మోడీ బస చేస్తున్న బ్లెయిర్ హౌస్‌లో ప్రపంచ కుబేరుడు, డోజ్‌ సారథి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)తోనూ మోడీ భేటీ అయ్యారు. మస్క్‌ తన సతీమణి షివోన్ జిలిస్‌.. ముగ్గురు పిల్లలు ఎక్స్, స్ట్రైడర్, అజూర్‌లతో మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా టెస్లా అధినేత పిల్లలకు మోడీ కొన్ని పుస్తకాలను బహుమతులుగా ఇచ్చారు. వీటిలో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'ది క్రెసెంట్ మూన్' (The Crescent Moon), విష్ణుశర్మ రచించిన 'పంచతంత్ర' (Panchatantra), ఆర్‌కే నారాయణ్‌ పుస్తకాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన చిత్రాలను మోడీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మస్క్‌ కుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. అందులో మస్క్ పిల్లలు ఈ పుస్తకాలు చదువుతున్నట్లు కనిపించారు.

మస్క్‌తో సమావేశంలో స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్థిరమైన అభివృద్ధి మొదలైన విషయాల్లో భారత్‌ యూఎస్‌కు చెందిన సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించినట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాకుండా పాలనా యంత్రాంగంలో భారత్ తలపెట్టిన సంస్కరణల గురించి మస్క్‌కు వివరించినట్లు మోదీ పేర్కొన్నారు. కాగా వీరి సమావేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ మస్క్‌ భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటున్నారని అన్నారు. అయితే అధిక సుంకాల కారణంగా భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమని పేర్కొన్నారు.

Next Story