- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
97 ఏళ్ల వృద్ధుడి కాళ్లు మొక్కిన మోడీ.. ఎవరీ మఖన్‌లాల్ సర్కార్?
పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో 97 ఏళ్ల బీజేపీ సీనియర్ నేత మఖన్ లాల్ సర్కార్ పాదాలకు ప్రధాని మోడీ నమస్కరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రి గా ఇవాళ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ఆర్.ఎన్ రవి ప్రమాణం చేయించారు. కోల్ కతాలోని బిగ్రేడ్ పరేడ్ గ్రౌండ్‍లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమిలోని పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్టేజీపై ఉన్న ఓ సీనియర్ నేతను శాలువాతో సత్కరించి, ఆలింగనం చేసుకుని అనంతరం కాళ్లు మొక్కి అతడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అక్కడ సభలో ఉన్న వారితో పాటు ఈ వీడియోను చూసిన వారందరినీ విశేషంగా ఆకర్షించింది. దీంతో ఆ వృద్ధుడు ఎవరు? ఆయన ప్రత్యేకత ఏంటి అనేదానిపై అందరూ ఆరా తీస్తున్నారు.
శ్యామ ప్రసాద్ ముఖర్జీకి సహాయకుడు:
బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య తెలిపిన వివరాల ప్రకారం.. సిలిగురి నివాసి అయిన ఈ వ్యక్తి పేరు మఖన్ లాల్ సర్కార్(97). బీజేపీ ప్రారంభ రోజుల్లో ఆయన అత్యంత సీనియర్ రాష్ట్ర నాయకులలో ఒకరు. మఖన్ లాల్ సర్కార్ గతంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీకి సహాయకుడిగా ఉండేవారు. 1952లో శ్యామ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. సిలిగురి సంస్థాగత జిల్లాకు ఆయన మొట్టమొదటి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత పశ్చిమ దినాజ్‌పూర్, జల్పాయిగురి, డార్జిలింగ్ జిల్లాలకు సంస్థాగత సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, కేవలం ఏడాది కాలంలోనే దాదాపు 10,000 మంది సభ్యులను చేర్పించారు. సాధారణంగా ఏ నాయకుడూ ఒకే పదవిలో రెండేళ్లకు మించి ఉండని ఆ కాలంలో ఆయన 1981 నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు.
కోర్టులోనే పాట పాడి జడ్జిని మెప్పించి..
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దేశభక్తి గీతం పాడినందుకు ఢిల్లీ పోలీసులు మఖన్ లాల్ సర్కార్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టుకు తీసుకెళ్లి క్షమాపణ చెప్పాలని కోరినా అందుకు మఖన్ లాల్ సర్కార్ నిరాకరించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, కేవలం ఒక పాట మాత్రమే పాడానని న్యాయమూర్తికి చెప్పారు. దాంతో ఆ పాటను వినాలని న్యాయమూర్తి కోరడంతో, కోర్టులోనే మళ్లీ ఆ పాట పాడి వినిపించారు. అతడి పాట విన్న న్యాయమూర్తి.. సర్కార్‌కు ఫస్ట్ క్లాస్ టికెట్ ఏర్పాటు చేసి ప్రయాణ ఖర్చుల కోసం రూ.100 ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. పార్టీ కోసం సిద్ధాంతం కోసం నిర్విరామంగా పని చేస్తున్న మఖన్ లాల్ సర్కార్ ఆశీర్వాదం తీసుకున్న మోడీని నెటిజన్లు బీజేపీ శ్రేణులు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.






