మహిళా బిల్లు రిజెక్షన్ ఎఫెక్ట్: NDA కూటమి కీలక నిర్ణయం.. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-17 15:53:38  IST  )

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై అధికార ఎన్డీయే కూటమి తీవ్రంగా స్పందించింది.

మహిళా బిల్లు రిజెక్షన్ ఎఫెక్ట్: NDA కూటమి కీలక నిర్ణయం.. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై అధికార ఎన్డీయే కూటమి తీవ్రంగా స్పందించింది. శుక్రవారం రాత్రి బిల్లు వీగిపోయిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విపక్షాల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు కాలరాశాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా సాధికారతకు విపక్షాలు మొదటి నుంచీ అడ్డుపడుతున్నాయి. నేడు వారి మహిళా వ్యతిరేక మైండ్‌సెట్ దేశం ముందు బట్టబయలైంది అని ప్రధాని మోడీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. మహిళా బిల్లుకు తాము అనుకూలమని చెబుతూనే, డీలిమిటేషన్ సాకుతో ఓటింగ్‌లో వ్యతిరేకించిన 'ఇండియా' కూటమి ద్వంద్వ నీతిని ఎండగట్టాలని ఎన్డీయే తీర్మానించింది.

మహిళా మోర్చా రంగంలోకి...

ఈ ఆందోళనల్లో బీజేపీ మహిళా మోర్చా సహా భాగస్వామ్య పక్షాల మహిళా విభాగాలను చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. దేశం అంతా చూస్తోంది.. మహిళలకు అధికారం దక్కకుండా ఎవరు అడ్డుకున్నారో మహిళా లోకం వారికి తగిన బుద్ధి చెబుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందకపోయినా, మహిళల పట్ల తమ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధిని ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. బిల్లు వీగిపోవడాన్ని ఒక 'రాజకీయ అస్త్రం'గా మార్చుకోవాలని ఎన్డీయే భావిస్తోంది. విపక్షాలు అభివృద్ధికి, మహిళా హక్కులకు అడ్డుపడుతున్నాయనే ముద్ర వేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది అధికార కూటమి వ్యూహంగా కనిపిస్తోంది.

Next Story