సీఎం విజయ్, త్రిష పై సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్

by Malleboina Mahesh |

సీఎం విజయ్, త్రిషపై సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కార్యకర్తల నిరసనలు!

సీఎం విజయ్, త్రిష పై సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు స్టార్ హీరోయిన్ త్రిష పుట్టినరోజు సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే (DMK MLA) చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన సీఎం విజయ్ అభిమానులు అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు ఉదయం డీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన అనిత ఆర్. రాధాకృష్ణన్‌ (R. Radhakrishnan)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడి జిల్లా ఆత్తూరు టౌన్ పంచాయతీ పరిధిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయ భవనాన్ని, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి ఆయన బయటకు వస్తున్న సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం ఉదయం న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, అనిత రాధాకృష్ణన్‌ను ఆయన సొంత కారులోంచి దించి పోలీస్ వాహనంలోకి ఎక్కించి అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ అరెస్ట్ వార్త తెలియడంతో ఘటనా స్థలంలో ఉన్న డీఎంకే శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు వాహనానికి అడ్డంగా నిలబడి, ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రహదారి దిగ్బంధం చేపట్టారు. దీంతో ఆత్తూరు ప్రాంతంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెల్లాచెదురు చేసిన పోలీసులు, అనిత రాధాకృష్ణన్‌ను తదుపరి విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ (District SP) కార్యాలయానికి తరలించారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో తూత్తుకుడి జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

Next Story