- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MK Stalin: వివాదాస్పద డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష భేటీ..!
వివాదాస్పద డీలిమిటేషన్ అంశంపై చర్చజరిపేందుకు తమిళనాడు (Tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (CM Stalin) అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద డీలిమిటేషన్ అంశంపై చర్చజరిపేందుకు తమిళనాడు (Tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (CM Stalin) అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. తమిళనాడు కేబినేట్ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Lok Sabha delimitation) అంశం, అందులోని సమస్యలపై చర్చించేందుకు 40 రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ అంశం తమిళనాడుపై వేలాడుతున్న కత్తి అని చెప్పుకొచ్చారు. తమిళనాడు కుటుంబ నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేయడం వల్లనే ఇప్పుడు ప్రతికూల స్థితిలో ఉందన్నారు. జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే, తమిళనాడు ఎనిమిది మంది ఎంపీలను కోల్పోతుందన్నారు. దీని వల్ల పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని నొక్కి చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా.. 2026 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ పునర్విభజన చాలా ప్రమాదకరమైనదని అందరి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించడంలో గొప్ప పని చేశాయన్నారు. కానీ పార్లమెంటులో తమిళనాడు బలం తగ్గడానికి, ప్రజల గొంతును అణచివేయడానికి అదే కారణమైతే.. దానిని ఎలా సమర్థించవచ్చు? అని స్టాలిన్ అన్నారు.
మరో భాషా యుద్ధానికి రెడీ..
తమిళనాడు తన పార్లమెంటరీ ప్రాతినిధ్యంపై రాజీపడదని, సమాఖ్య సూత్రాలను సమర్థించే న్యాయమైన, పారదర్శక ప్రక్రియకు పిలుపునిచ్చామని స్టాలిన్ అన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ఐక్యతను కోరుతూ.. తమిళనాడు భవిష్యత్ కోసం ఐక్యంగా పోరాడదామని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి అన్నారు. అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్‌తో పాటు, త్రిభాషా సమస్య, నీట్ ప్రవేశపరీక్షపై కూడా చర్చిస్తామని స్టాలిన్ అన్నారు. జాతీయ విద్యావిధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. కాగా.. ఈ అంశంపై స్టాలిన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో భాషా యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.






